WOMEN NOT REASON FOR INFERTILITY

Home/women-not-reason-for-infertility

women-is-not-reason-for-infertility-by-dr.kolliramadevi-ivf-specialist

సంతానలేమికి స్త్రీయే కారణం కాదు || WOMEN NOT REASON FOR INFERTILITY

వంశీ మధులతల వివాహమై పదేళ్ళు గడచిపోయింది. మొదటి రెండుమూడు సంవత్సరాలపాటు ఏ బాదరబందీ లేకపోతేనే జీవితంలో ఆనందాన్ని అనుభవించవచ్చు అనే ఆలోచనతో పిల్లలు కలగలేదన్న విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆ ఆలోచనవచ్చి డాక్టర్ దగ్గరకి వెళ్ళేసరికే అయిదేళ్ళు గడిచిపోయింది.   WOMEN NOT REASON FOR

పిల్లలు కలగకపోతే దానికి కారణం స్త్రీ (మధులత)యే కాబట్టి ఆమెను వెంటబెట్టుకుని మధులత అత్తగారు గైనకాలజిస్టును సంప్రదించారు. భార్యాభర్తలిద్దరినీ పరీక్షించాలని డాక్టరు చెప్పినా ‘అబ్బాయిలో ఏ లోపమూ ఉండదులే’ అంటూ అత్తగారు కోడలిచేత రెండేళ్ళపాటు మందులు వాడించారు. మధులత కూడా లోపం తనదేమోనన్న ఆలోచనతో దుఃఖాన్ని దిగమింగుకుని జాగ్రత్తగా మందులు వాడింది.

సంవత్సరాలు గడిచినా ప్రయోజనం లేకపోవడంతో మధులత అత్తగారు కొడుకుకోడల్ని తీసుకుని ఇన్ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించారు. భార్యాభర్తలిద్దరికీ పరీక్షలు చేసి, మధులతలో ఏ లోపమూ లేదనీ, వంశీ వీర్యకణాల్లోనే లోపం ఉందనీ గుర్తించి, అందువల్లనే పిల్లలు కలగటం లేదని నిర్ధారించారు. సాధారణంగా పిల్లలు కలగలేదంటే స్త్రీలోనే లోపం ఉందని భావించే ఈ ప్రపంచంలో అత్యాధునిక సంతానసాఫల్యతా వైద్య చికిత్సా విధానాల కారణంగా నూటికి 50 పై చిలుకు సందర్భాలలో భర్తలో వీర్యకణాల లోపమే సంతానలేమికి కారణమని అంతర్జాతీయంగా జరిగిన పలుసర్వేలలో వెల్లడయ్యింది. 

పిల్లలులేని దంపతులలో సగంమందికి పురుషుల్లో వీర్యకణాల్లో లోపం మాత్రమే ఉంటుంది. వీర్యకణాల సంఖ్య 20 మిలియన్ల కన్నా తక్కువగా ఉండటం. వీటిలో కదలికలు ఉండే కణాలు 50 శాతం కన్నా తక్కువగా వుండటం, ముందుకు కదిలే వీర్యకణాలు 25 శాతం కన్నా తక్కువగా ఉండటం, సారూప్యత కలిగిన వీర్యకణాలు 30 శాతం కన్నా తక్కువగా ఉండటం వంటి కారణాల వలన స్త్రీలలో ఎటువంటి లోపం లేకపోయినప్పటికీ మామూలుగా గర్భిణీ వచ్చే అవకాశాలు ఉండవు. 

వీర్యకణాలు ఈవిధంగా ఉండటానికి టెస్టిస్లో లోపాలుగానీ, వీర్యకణాల ఉత్పత్తిలో తేడాలు గానీ ఉండవచ్చు. కొన్ని రకాల లోపాలను వైద్య చికిత్స ద్వారా సరిచేయటం వల్ల వీర్యకణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. మరికొన్ని లోపాలు చికిత్స ద్వారా సరిచేయలేనప్పుడు ఆధునిక వైద్య చికిత్సా విధానాల సహాయంతో సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది. INFERTILITY

వీర్యకణాల్లో లోపాలు-కారణాలు :

వృత్తి పనిలో అలవాట్లు బాగా ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశాలలో పనిచేసే వారిలో, పురుగులమందులను వినియోగించే వారిలో, రేడియేషన్, కీమోథెరఫీ వంటి చికిత్సలు పొందిన వారిలో, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో, పౌష్టికాహార లోపం ఉన్నవారిలో, ధూమపానానికి బాగా ఎక్కువగా అలవాటు పడినవారిలో, మద్యపానం అధికంగా తీసుకునేవారిలో, హెరాయిన్ కొకైన్ వంటి మాదకద్రవ్యాలకు అలవాటుపడినవారిలో వీర్యకణాలలో లోపం ఉండవచ్చు. 

చిన్నతనంలో వృషణాలకు గాయాలు కావడం లేదా ఇన్ఫెక్షన్స్కు గురికావడం, టెస్టిస్ లో ట్యూమర్స్ రావడం, వేరికోసిల్ ఉండటం, యాంటీస్పామ్, యాంటీబాడీస్ ఉండటం వంటి కారణాల వల్ల కూడా వీర్యకణాలలో లోపం ఏర్పడవచ్చు.

పుట్టుకతో లోపాలు :

కొంతమందిలో పుట్టుకతో వచ్చే లోపాల కారణంగా కూడా వీర్యకణాల సంఖ్య, కదలికలలో తేడాలు ఉండవచ్చు. పుట్టుకతోనే టెస్టిస్ నిర్మాణం సరిగా జరగకపోయినా, సరిగా కిందకు రాకపోయినా, క్రోమోజోమ్స్ తేడాలు ఉండటం, వీర్యకణాల ఉత్పత్తి మధ్య దశలోనే ఆగిపోతుండటం వంటి కారణాలవల్ల కూడా వీర్యకణాలలో లోపాలు ఏర్పడతాయి!

హార్మోన్లలో తేడాలు :

హర్మోన్ల స్థాయి తక్కువగా ఉండటం, ఇతర ఎండోక్రెమ్స్ కారణాల వలన కూడా వీర్యకణాలలో లోపం ఏర్పడవచ్చు. మరే ఇతర వ్యాధులు ఉన్నా మరే ఇతర వ్యాధులకు గురైనా వీర్యకణాలలో లోపం ఏర్పడవచ్చు. ఉదాహరణకు కిడ్నీ ఫెయిల్యూర్, సిరోసిస్ సికిల్సలేమియా, వెన్నుపాముకు దెబ్బతగలడం, లివర్సిగోసిస్ వంటి వ్యాధులతో బాటు స్పెర్మ్ ప్రయాణమార్గంలో అడ్డంకులు ఏర్పడటం కూడా వీర్యకణాలలో లోపాలకు కారణాలే!

సరిదిద్దగల లోపాలు :

వేడి వాతావరణంలో పనిచేసే వృత్తిని మార్చుకోవడం, చెడు అలవాట్లను మానుకోవడం, వేరికోసిల్న ఆపరేషన్ ద్వారా తొలగించుకోవడం, సమగ్ర పౌష్టికాహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పని నిద్రవేళల్ని పాటించడం, అనవసర టెన్షన్స్ లేకుండా ఉండటం, హార్మోన్లలో లోపాలు ఉన్నట్లయితే సరైన చికిత్స ద్వారా ఆ లోపాలు సరిదిద్దుకోవడం వంటి చర్యల వల్ల వీర్యకణాల ఉత్పత్తిని, సంఖ్యను, కదలికలను కొంతమేరకు మెరుగుపరుచుకోవచ్చు.

సమగ్ర పరీక్షలు అవసరం :

వీర్యకణాలలో లోపాలకు ఏ స్పష్టమైన కారణం తెలియకపోతే- మందులు వాడినా పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. అందువల్ల వీర్యకణాలలో లోపాలకు సరైన కారణం తెలుసుకునేందుకు అవసరమైన సమగ్ర పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది.

ఆధునిక చికిత్సలు :

వీర్యకణాలలో లోపాలకు కారణాలు ఏమైనప్పటికీ మందులు, ఆపరేషన్(వేరికోసిల్, స్పెర్మ్ ప్రయాణమార్గంలో అడ్డంకులను తొలగించేందుకు) వంటి చికిత్సల వల్ల వీర్యకణాల సంఖ్య పెరగకపోయినట్లయితే సంతాన సాఫల్యతా సహాయతా విధానాలు (ART) పొందవలసి ఉంటుంది. 101, IVE, ICSI, TESA, డోనర్ ఇన్సెమినేషన్ వంటి ఆధునిక వైద్య విధానాలు ద్వారా ఇటువంటి వారికి అధిక ప్రయోజనం అందించవచ్చు.

IUI ట్రీట్మెంట్ :

వీర్యకణాలలో లోపాలు మరీ ఎక్కువగా లేనట్లయితే ఐయుఐ విధానం ద్వారా సంతానప్రాప్తికి ప్రయత్నించవచ్చు. ఈ విధానంలో స్త్రీ అండాలను టాబ్లెట్లు మరియు హార్మోన్ల ద్వారా ఉత్తేజపరచి రెండు, మూడు అండాలు తయారయ్యేటట్లు చేసి, అండం విడుదలైన సమయంలో భర్త వీర్యకణాలు సేకరించి వాటిని శుద్ధి పరిచి, సాంద్రత, కదలికలు ఎక్కువ అయ్యేటట్లుగా చేసి సన్నటి ట్యూబు ద్వారా భార్యగర్భకోశంలో ప్రవేశపెడతారు. 

ఈవిధానం వలన ప్రతి ఒక్కసారికి 15 నుంచి 20 శాతం మందికి సంతానసాఫల్యత కలగవచ్చు. ఈ విధానం అయిదారుసార్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయినట్లయితే IVF లేదా ICSI విధానాల ద్వారా ప్రయత్నించవలసి ఉంటుంది.

IVF ట్రీట్మెంట్ :

వీర్యకణాల సంఖ్య 10 నుంచి 20 మిలియన్ల మధ్యలో ఉన్నట్లయితే IUI విధానం అయిదారు సార్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేనప్పుడు IVF విధానం ప్రయత్నించవచ్చు. ఈ విధానంలో హార్మోన్ ఇంజక్షన్స్ ఇవ్వడం ద్వారా స్త్రీ అండాలను ఉత్తేజపరచి (సుమారు 8 నుండి 10 అండాలు), అండాలుగా పరిపక్వత చెందిన దశలో మత్తుమందు ఇచ్చి అల్ట్రాసౌండ్ స్కానింగ్ సహాయంతో అండాలను తీసి ఇంక్యుబేటర్లో భద్రపరుస్తారు. 

అదే సమయంలో భర్త వీర్యకణాలను సేకరించి శుద్ధిపరచి, భద్రపరచిన అండాల చుట్టూ వీర్యకణాలను ఇన్సెమినేట్ చేస్తారు. ఈ విధానంలో వీర్యకణం అండంలోకి సహజంగా చొచ్చుకుని పోవలసి ఉంటుంది. తక్కువ సంఖ్యలో వీర్యకణాలు ఉన్నప్పటికీ, అవి శక్తివంతంగా ఉంటేగానీ ఈ విధానం సఫలీకృతం కాదు. ఈ విధానం వలన సంతాన సాఫల్యత ప్రతి ఒక్కసారికి 30 శాతం ఫలితం ఇవ్వవచ్చు. అప్పటికీ సంతానం కలగకపోతే అత్యాధునిక చికిత్సావిధానమైన ICSI ట్రీట్మెంట్ పొందవలసి ఉంటుంది.

ICSI ట్రీట్మెంట్ :

వీర్యకణాల సంఖ్య 5 మిలియన్లకన్నా తక్కువగా ఉన్నప్పుడు, వీర్యకణాల కదలికలు బాగా నెమ్మదిగా ఉన్నప్పుడు, వీర్యకణాల సారూప్యతలో తేడాలు ఉన్నప్పుడు, యాంటీ స్పెర్మ్, యాంటీబాడీస్ ఉన్నప్పుడు నేరుగా ICSI (ఇక్సీ) ట్రీట్మెంట్ పొందవలసి ఉంటుంది. వీర్యకణాల సంఖ్య, కదలిక, సారూప్యతల్లో తేడాలు ఉన్నప్పటికీ వీర్యకణాల్లో జీవం ఉంటే చాలు ఈ విధానం ద్వారా సంతానప్రాప్తికి ప్రయత్నించవచ్చు. 

IVF ట్రీట్మెంట్ రెండుసార్లు పొందినప్పటికీ సంతానప్రాప్తి కలగకపోవడం మరియు ఫెర్టిలైజేషన్ తక్కువగా ఉండటం, లేదా ఫెర్టిలైజేషన్ అసలు జరగకపోవడం వంటి సందర్భాలలో ICSI ట్రీట్మెంట్ పొందటంద్వారా మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ప్రపంచంలో 1992 నుంచి అందుబాటులోకి వచ్చిన ICSI ట్రీట్మెంట్ ప్రత్యేకత ఏమిటంటే ఇన్వెర్టెడ్ మైక్రోస్కోప్ మరియు మైక్రో మేనిప్లేటర్ సహాయంతో వీర్యకణాల్ని అండంలోకి నేరుగా చొప్పిస్తారు. తద్వారా ఫలదీకరణ శాతం మరింతగా పెరుగుతుంది. ఈ విధానంలో ప్రతి ఒక్కసారికి 30 శాతం నుంచి 40 శాతం మందిలో సంతానప్రాప్తి కలగవచ్చు.

TESA ట్రీట్మెంట్ :

వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా జరుగుతున్నప్పుడు లేదా పూర్తిస్థాయిలో (హైపో స్పెర్మిటోజెనెసిస్) ఉత్పత్తి జరగకుండా మధ్యంతరంగా ఆగిపోయినప్పుడు, వీర్యకణాల ప్రయాణమార్గంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు వీర్యంలో వీర్యకణాలు ఉండవు. ఇటువంటి సందర్భాలలో కూడా భర్త వీర్యకణాల ద్వారానే సంతానం పొందే అవకాశాన్ని అత్యాధునిక చికిత్సా విధానమైన TESA-ICSI ద్వారా పొందవచ్చు. ఇందులో వీర్యకణాలను వృషణాల నుంచి సన్ని సూది సహాయంతో సేకరించి ఇక్సీ విధానం అమలు పరుస్తారు.

ట్రయోటీసీ :

ఈ విధానంలో వృషణాల నుంచి తీసిన టెస్టిక్యులార్ బయాప్సీని లేదా దాని నుంచి సేకరించిన స్పెర్మిటోజోవాను గానీ క్రయోప్రిజర్వేషన్ చేసి భద్రపరుస్తారు. దానిని చికిత్స సమయంలో అవసరానికి అనుగుణంగా ఉపయోగించడం జరుగుతుంది. మగవారిలో తేడాలు ఉన్నప్పటికీ ఇక్సీ ట్రీట్మెంట్ అమలు పరచడం అధిక ప్రయోజనకారిగా ఉంటుంది.

డోనార్ ఇన్సెమినేషన్ :

వీర్యకణాలు అస్సలు లేనప్పుడు, దాత వీర్యకణాలతో సంతానసాఫల్యత పొందవచ్చు. పెళ్ళయి చాలాకాలంగా కలిసి కాపురం చేస్తున్నా సహజంగా పిల్లలు కలగని దంపతులు సమగ్రమైన వైద్యపరీక్షలు చేయించుకుని, సంతానలేమికి అసలైన కారణం గుర్తించి, మందుల ద్వారానో లేదా చిట్కా వైద్యులతోనో సమయం వృథా చేయకుండా అత్యాధునిక సంతానసాఫల్యతా విధానాలద్వారా సంతానప్రాప్తి పొందడం ఉత్తమం. 

చాలా సందర్భాలలో సంతానలేమికి స్త్రీ ఒక్కతే కారణం అని భావించకుండా భార్యభర్తలిద్దరూ పరీక్షలు చేయించుకోవడం వలన భర్త వీర్యకణాల లోపాలు సరిదిద్దుకోవడంతోబాటు, సంతాన ప్రాప్తి పొందే అవకాశం ఉంటుందని గుర్తించాలి.

-డా. కొల్లి రమాదేవి, MD, DNB, DGO(MRCOG)
స్త్రీ సంబంధిత వ్యాధులు, ఫెర్టిలిటీ నిపుణులు, ఫోన్ నెం. 9246417882

Follow us in Socail Media Platforms: Facebook | Instagram | YouTube