Tubal Blockage – Cause of Infertility

మూసుకున్న ట్యూబులు చెదిరిన కలలు | Tubal-blockage-cause-of-infertility

ఇరవయ్యేళ్ళ సునీతకు పెళ్ళయింది. ఆమెకు పిల్లలంటే పిచ్చిప్రేమ. పిల్లలకోసం ఆమె ఎన్నో కలలు కంది. ఆమె కలలు నిజమయ్యాయి. పెళ్ళయిన మొదటి సంవత్సరంలోనే గర్భిణీ వచ్చింది. అయితే “ఇంత చిన్న వయసులో అప్పుడే పిల్లలేంటి? వాళ్ళమాట కాదనలేకపోయింది. ఆమెను ఒప్పించి వాళ్ళ ఊరిలో అబార్షన్ చేయించారు. Tubal-blockage-cause-of-infertility

ఆ తరువాత కొద్ది రోజులకే జ్వరం రావడం, పొత్తి కడుపులో నొప్పి ఉండడంతో ఎందుకైనా మంచిదని గైనకాలజిస్టును. సంప్రదిస్తే – అబార్షన్ తరువాత ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి, మందులు వాడారు. అయినా అప్పుడప్పుడూ పొత్తికడుపులో నెప్పిరావడం, వైట్ డిశ్చార్జ్ కొంచెం ఎక్కువ కావడం గత రెండు మూడేళ్ళ నుంచీ జరుగుతున్నా మళ్ళీ గర్భిణీ కూడా రాకపోవడంతో డాక్టరును సంప్రదిస్తే పరీక్షలు చేసి, పెల్విక్ ఇన్ఫెక్షన్ వలన ఫెల్లోపియన్ ట్యూబులకు వాపులు వచ్చి  మూసుకుపోయాయని తేల్చారు.

ఇలాంటి వారిలో సాధారణంగా పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువనీ, అయితే -టెస్ట్యూబ్ బేబీ (ఐవిఎఫ్) చికిత్స పొందడం ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని డాక్టర్లు తేల్చారు.

ఈ అండవాహికలు (ఫెల్లోపియన్ ట్యూబులు మూసుకుపోవడానికి ముఖ్యమైన కారణాల్లో మొదటిది పెల్విన్ ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసులో ఉంటూ ఉంటుంది. అబార్షన్లు అయిన తర్వాత మరియు సుఖవ్యాధుల కారణంగా ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం వుంటుంది.

షుగరు వ్యాధిగ్రస్తులు, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకిన వారిలో ఈ వ్యాధి తీవ్రంగా వుంటుంది. ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్ గర్భసంచి, సర్విక్స్, ట్యూబులు, ఓవరీలు, పెల్విక్ కణజాలంపై ప్రభావితం చూపడం వల్ల వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి.

ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్ను ప్రారంభదశలోనే గుర్తించి తగిన వైద్య సహాయం పొందవలసివుంటుంది. అలా కానిపక్షంలో తీరని నష్టం వాటిల్లవచ్చు. సుమారు అరవై శాతం మంది మామూలుగా పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోతారు.

పిల్లలు పుట్టే అవకాశం ఉన్నవారిలో 7 నుంచి 10 శాతం మందికి ట్యూబుల్లో గర్భిణీ వచ్చే ప్రమాదం ఉంటుంది. పెల్విక్ ఇన్ఫెక్షన్ సాధారణంగా బాక్టీరియా వల్లవస్తుంది. నాలుగు రకాల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు దీనికి కారణం కావచ్చు.

పయోజెనిక్ ఇన్ఫెక్షన్లు :

అపరిశుభ్రత, ప్రసవ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఇంటి దగ్గరే ప్రసవం కావడం, నిపుణులైన వైద్యుల చేత కాకుండా చిట్కా వైద్యులతో అబార్షను చేయించుకోవడం వలన ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. జననేంద్రియాల ద్వారా ఈ బాక్టీరియా గర్భసంచిలోకి పాకి, లింఫ్ గ్రంథుల ద్వారా రక్తనాళాల ద్వారా ఇతర భాగాలకు సోకి త్వరితగతిన వ్యాప్తి చెందుతుంది.

ఒక్కోసారి ప్రాణహాని కూడా జరగవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ నెమ్మదిగా వ్యాప్తి చెందితే – ట్యూబులు, ఓవరీస్ అన్నీ కలిపి ఒక ముద్దలా తయారవుతాయి. ట్యూబులు వాచి నీరు చేరడం, చీము చేరడం, పెల్విస్లో అతుకులు (అడిహిషన్స్) ఏర్పడటం జరుగుతుంది. ఈకోలే అనే బాక్టీరియా దీనికి కారణమౌతుంది.

సుఖవ్యాధుల వల్ల వచ్చే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ :

చిన్న వయసులోనే సెక్స్లో పాల్గొనటం (టీనేజ్ సెక్స్), విచ్చలవిడితనం వంటి కారణాల వల్ల పెల్విక్ ఇన్ఫెక్షన్ అధికమౌతుంది. 40శాతం మందిలో సుఖవ్యాధుల వల్ల ఈ ఇన్ఫెక్షన్ కలుగుతుంది. యోని, సర్విక్స్ ద్వారా ట్యూబులకీ, ఓవరీస్కీ వ్యాప్తి చెందుతుంది. ఓనోకోకల్ ఇన్ఫెక్షన్లు (గనేరియా), క్లమేడియల్ ఇన్ఫెక్షన్లు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

ఇవి కాకుండా – ఈకోలై, మైకో ప్లాస్మా, ఎనరోబ్స్, వంటి బాక్టీరియాల వల్ల ఈ ఇన్ఫెక్షన్లు మళ్ళీ మళ్ళీ రావడానికి దోహదపడతాయి. మొదటిసారి ట్యూబులకు వచ్చిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోవచ్చు లేదా ట్యూబులు పూర్తిగా మూసుకుపోవచ్చు.

లేదా అడిషన్స్ ఏర్పడవచ్చు. ఈ మళ్ళీ మళ్ళీ వచ్చే ఈ ఇన్ఫెక్షన్ల వల్ల ఇది దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది. దీని వల్ల ట్యూబుల్లో చెడునీరు చేరి, హైడ్రోసాల్ఫింక్స్, ట్యూబులు ఓవరీలు కలిసి ఒక పెద్ద కణితిగా మారడం, చీము పట్టడం, గర్భసంచి చుట్టూ అడిహిషన్స్ ఏర్పడటం జరుగుతుంది.

వీటివల్ల కడుపులో నెప్పి, పొత్తికడుపు నొక్కితే నెప్పి, సంభోగంలో నెప్పి, వైట్ డిశ్చార్జి, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఏర్పడటం చూస్తాం. 

టీబీ వల్ల వచ్చే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ :

మనదేశంలో 10 నుంచి 15 శాతం మందికి టీబీ కారణంగా పెల్విక్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెంది సంతానాన్ని పొందలేకపోతున్నారు. ఊపిరితిత్తుల్లో గానీ, లింఫ్ గ్రంథుల్లోగానీ ఉన్న టీబీ క్రిములు రక్తం ద్వారా వందశాతం ట్యూబుల పైనా, అరవైశాతం ఎండోమెట్రియమ్ పైనా, 25శాతం ఓవరీస్పైనా, 15శాతం సర్విక్స్ పైనా ఒక్కశాతం యోనిపైనా దాడిచేస్తాయి.

ఈ ఇన్ఫెక్షన్ ప్రారంభదశలో ఉన్నప్పుడు ట్యూబులపైన చిన్న చిన్న ట్యూబర్కిల్స్ మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ట్యూబులు చీముతో నిండిపోవడం (Pyosalpinx) లేదా ఎండోమెట్రియమ్ పొర పూర్తిగా దెబ్బతిని నెలసరులు రావడం పూర్తిగా ఆగిపోవచ్చు.

ఈ పెల్విక్ టీబీ వల్ల ఎటువంటి లక్షణాలూ కనిపించవు. ఎక్కువ మందిలో పిల్లలు లేకపోవడం వలన ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్కు వచ్చినప్పుడు డయాగ్నోస్టిక్ లాపరోస్కోపీ ద్వారా ఈ వ్యాధిని గుర్తించడం జరుగుతుంది.

ఇతర ఇన్ఫెక్షన్లు :

ట్రైకోమోనియల్, కాండీడియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అరుదుగా అమీబియల్ ఇన్ఫెక్షన్లు కారణం కావచ్చు.

 

వ్యాధి నిర్ధారణ :

పెల్విక్ ఎగ్జామినేషన్లో, సర్వైకల్స్ స్మియర్ పరీక్షల్లో గోనోకోకై ఉండటం, రక్తపరీక్షల్లో సిఆర్పి, ఇఎస్ఆర్ ఎక్కువగా వుండటం, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, డయాగ్నిస్టిక్ లాపరోస్కోపీలతో వ్యాధి నిర్ధారణ మరియు తీవ్రతలను గుర్తించవచ్చు.

ట్రీట్మెంట్ :

పెల్విక్ ఇన్ఫెక్షన్కు గురైన వారికి సరైన సమయంలో తగిన మోతాదులో యాంటీబయోటిక్స్ వాడటం చాలా అవసరం. పయోజెనిక్ ఇన్ఫెక్షన్స్లో తీవ్రత ఎక్కువగా ఉండి, యాంటీబయోటిక్స్ తో రెస్పాన్స్ లేనట్లయితే ప్రాణహాని జరగకుండా ఉ౦డేందుకు గర్భసంచిని శస్త్రచికిత్స ద్వారా తొలగించరావచ్చు.

ఈ వ్యాధి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు పిల్లలున్న 35 సం. దాటిన వారిలో హిస్టరెక్టమీ (గర్భసంచి తొలగింపు) చెయ్యవలసి వుంటుంది. పిల్లలు లేని వారిలో ట్యూబుల్లో నీరు చేరినట్లయితే లాపరోస్కోపీ ద్వారా అండాశయాలను మాత్రం ఉంచి ట్యూబులను తొలగించవలసి వస్తుంది.

పెల్విక్ టీబీ ఉన్నవారికీ టీబీ మందులు (యాంటీ ట్యూబర్ ప్లస్ ట్రీట్మెంట్-ATT) తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం పాటు వాడవలసి వుంటుంది. ఈ విధానాల ద్వారా 90శాతం మందిలో మంచి ఫలితాలు ఉంటాయి.

పెల్విక్ ఇన్స్టెన్షన్ తరువాత సంతానప్రాప్తి :

అబార్షన్ తరువాత లేదా మొదటి ప్రసవం తరువాత పెల్విక్ ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, గర్భసంచి ఫెలోపియన్ ట్యూబులు కలిసే చోట అడ్డంకులు ఏర్పడతాయి. దీనిని కార్మువల్ బ్లాక్ అంటారు. గోనోకోకల్ ఇన్ఫెక్షన్లో ట్యూబుల్లో ఉండే ఫింబ్రియాలు మూసుకుపోతాయి.

మల్టిపుల్ బ్లాక్స్ ఏర్పడవచ్చు. లాపరోస్కోపీ ఆపరేషన్ ద్వారా సాధ్యమైనంత మేరకు ఈ ఇబ్బందిని సరిచేసే ప్రక్రియ చేపట్టవచ్చు. దీనిలో భాగంగానే బాగా పాడైపోయిన ట్యూబులు తీసివేయడం, (హైడ్రో సాల్ఫింక్స్ మరియు పయోసాల్ఫింక్స్ లో) తదుపరి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా సంతాన సాఫల్యతకు ప్రయత్నాలు చేయవచ్చు.

ముందు జాగ్రత్త :

సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం, శానిటరీ నాప్కిన్స్ ఉపయోగించడం, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో హాస్పిటల్ డెలివరీ చేయించుకోవడం, కష్టమైన కాన్పులను ముందుగానే గుర్తించి సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించడం, అధిక రక్తస్రావం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, సరైన సమయంలో ముందుగానే యాంటీ బయోటిక్స్ వాడటం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

యువత, స్కూల్ పిల్లల్లో హెల్త్ ఎడ్యుకేషన్ క్లాసులు ప్రవేశపెట్టి, అవగాహన పెంపొందించడం తక్షణ కర్తవ్యం. ఈ ఇన్ఫెక్షన్లు ఒకసారి వచ్చి తగ్గిన తరువాత మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల ఈ ఇన్ఫెక్షన్ తిరిగి రాకుండా ఉండాలంటే – భాగస్వామి కూడా విధిగా చికిత్స పొందవలసి ఉంటుంది.

(80 శాతంమంది భాగస్వాముల్లో ఎటువంటి లక్షణాలూ లేకుండా యురెత్రల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి).

ఎన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చాయి?

వాటి తీవ్రత ఎంత? ఆ ఇన్ఫెక్షన్లు ఎంతకాలం ఉన్నాయి? ఏ బ్యాక్టీరియా వల్ల ఇది వచ్చింది? అనే విషయాలపై ట్యూబులు మూసుకుపోవడం (Taubal Block ) ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు – ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే 8 శాతం మందిలో ట్యూబులు మూసుకుపోతాయి.

మూడుసార్లు వస్తే 40శాతం మందిలో ట్యూబులు మూసుకుపోతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చిన మొదటిసారే, మొదటి మూడు రోజుల్లోపలే తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఏ ఇబ్బందులూ ఉండవు. సంతాన సాఫల్యత కూడా సిద్ధిస్తుంది.

– డా. కొల్లి రమాదేవి

MD, DNB,DGO (MRCOG), స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు, ఫోన్ : 92464 – 17882

Follow us in Socail Media Platforms: Facebook | Instagram | YouTube