ప్రెగ్నెన్సీ కేర్ | Pregnancy Care
ప్రెగ్నెన్సీ కేర్ | Pregnancy Care
స్త్రీకి బహిష్టు రాకపోయినా.. వికారంగా ఉంటూ ముఖ్యంగా ఉదయం సమయంలో వాంతులు అవుతున్నా.. ఎక్కువ సార్లు మూత్రం అవుతున్నా.. పొట్ట కొంచెం పెరిగినట్లుగా అనిపిస్తున్నా.. రొమ్ములు కొంచెం ఉబ్బెత్తుగా పెరిగినట్లుగా ఉన్నా.. మొహం మీద, రొమ్ములమీద పొట్టమీదా నల్లటి మచ్చలు ఏర్పడినట్లనిపించినా.. ఆ స్త్రీ గర్భవతి అయ్యిందని అనుమానించవచ్చు. (pragnancy care)
సాధారణంగా జరిగే ఈ గర్భధారణ స్థితిని చిన్నపాటి వైద్యపరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. అయితే పెళ్ళయిన దంపతులు ఒక సంవత్సరంపాటు కలసి కాపురం చేస్తున్నా సంతానం కలగకపోవడానికి వారిలోని లోపాలే కారణమైనప్పుడు ఐవిఎఫ్, ఇక్సీ వంటి అత్యాధునిక వైద్యచికిత్సల సహాయంతో గర్భధారణ ధరించినప్పుడు పై లక్షణాలన్నీ ఉంటాయి.
ఇటువంటి సమయంలో ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా గర్భధారణను నిర్ధారించుకోవలసి ఉంటుంది.
గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండటం ఎలా?
గర్భవతి అయిన స్త్రీ మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజలవణాలు, ఇనుము పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు శరీరానికి చాలా అవసరం. అలాగే-గర్భిణీ స్త్రీ, ఆహారంలో అయొడైజ్డ్ సాల్ట్ ఉపయోగించడం చాలా మంచిది.
ఆహారంలో అయొడిన్ లోపించినట్లయితే ‘గాయిటర్’ వ్యాధి వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. గర్భిణీ స్త్రీకి అయొడిన్ లోపించడం వల్లకడుపులో పెరుగుతున్న శిశువుకు ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అయొడిన్ సాల్ట్ వాడకం అవసరం.
గర్భిణీస్త్రీకి శారీరక పరిశుభ్రత చాలా అవసరం. రోజూ క్రమం తప్పకుండా స్నానం చేయాలి. దంతావధానం అతిముఖ్యం. చివరి నెలలో భార్యాభర్తల కలయిక మంచిది కాదు. సంభోగసమయంలో ఉమ్మనీటిసంచి పగిలిపోయి ఇన్ఫెక్షన్ రావచ్చు.
సాధారణ గర్భిణీకి ఎక్కువమందులు వాడకూడదు. అయితే ఐవిఎఫ్., ఇక్సీ వంటి అత్యాధునిక వైద్యచికిత్సల ద్వారా గర్భధారణ ధరించినప్పుడు ఫెర్టిలిటీ నిపుణుల సలహామేరకు తగినమందులు క్రమం తప్పకుండా వాడవలసి వుంటుంది.
అలాగే-ఐవిఎఫ్, ఇక్సీ వంటి ఆధునిక చికిత్సల ద్వారా గర్భవతులైన స్త్రీలు ఫెర్టిలిటీ నిపుణుల సూచనల మేరకు సంభోగసమయంలో తగిన జాగ్రత్తలు విధిగా పాటించవలసి ఉంటుంది.
ఈ నవనాగరిక సమాజంలో కొన్ని ప్రాంతాలలో స్త్రీలు కూడా పొగతాగడం, మద్యం సేవించడం జరుగుతుంటుంది. గర్భిణీ సమయంలో పొగతాగడం, మద్యం సేవించడం వల్ల తల్లికీ బిడ్డకూ కూడా మంచిదికాదు. సాధారణ ప్రెగ్నెన్సీలో శారీరక వ్యాయామం అవసరపడుతుంది.
కానీ- ఐవిఎఫ్, ఇక్సీ వంటి చికిత్సల ద్వారా గర్భవతులైన స్త్రీలు డాక్టరు సలహా లేకుండా ఎటువంటి వ్యాయామాలూ చేయకూడదు. అలసట కలిగించే పనులను మాని వేయడం ఉత్తమం.
గర్భిణీ స్త్రీలు- చిన్న చిన్న సమస్యలు :
వికారం లేక వాంతులు : గర్భిణీ ధరించిన తొలి రోజుల్లో కడుపులో వికారం ఉన్నట్లనిపించడం, ఉదయం సమయంలో వాంతులు కావడం సహజం. ఉదయం నిద్రలేచిన వెంటనే రొట్టె, బిస్కట్లు తినడం మంచిది. ఒకేసారి ఎక్కువగా తినడం కంటే కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది.
వాంతులు మరీ ఎక్కువగా అవుతున్నప్పుడు వైద్య నిపుణుల సూచనల మేరకు ‘యాంటీ హిస్టమిన్’ను ఉదయం నిద్ర లేవగానే, రాత్రి నిద్రపోయేముందు వేసుకోవలసి ఉంటుంది. నూనె పదార్థాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
ఐవిఎఫ్, ఇక్సీ వంటి అత్యాధునిక వైద్యచికిత్సల ద్వారా గర్భవతులైన వారు వైద్యనిపుణుల అనుమతి లేకుండా ఎటువంటి చిట్కా వైద్యాలూ లేదా సొంత వైద్యాలూ చేయకూడదు.
మంట లేక నొప్పి : గర్భిణీ స్త్రీలకు సామాన్యంగా పై కడుపులోనూ, ఛాతీలోనూ మంటగా లేదా నొప్పిగా అనిపిస్తుంటుంది. పుల్లత్రేన్పులు రావడం జరుగుతుంటుంది. ఇటువంటి సమయంలో ఎక్కువ మొత్తంలో కాకుండా, కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం మంచిది.
పాలు తాగడం ఆరోగ్యం. అత్యాధునిక చికిత్సల సహాయంతో గర్భవతులైన స్త్రీలు ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఫెర్టిలిటీ నిపుణుల సలహా మేరకు ఆహార నిబంధనలు పాటించవలసి ఉంటుంది.
కాళ్ళవాపు : గర్భవతులైన స్త్రీలకు కాళ్ళ వాపులు సహజం. నిద్రపోయేటప్పుడు కాళ్ళను కొంచెం ఎత్తులో ఉంచి నిద్రపోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. రక్తనాళాలపై గర్భస్థ శిశువు ఒత్తిడి కారణంగా పాదాలవాపు వస్తుంటుంది. రక్తహీనత, ఆహారలోపం, ఉన్న స్త్రీలకు, ఉప్పు ఎక్కువగా వాడే గర్భిణీలకు కాళ్ళవాపు ఎక్కువగా వస్తుంటుంది.
మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉప్పును స్వల్పంగా తీసుకోవడం శ్రేయస్కరం. పాదాలు ఎక్కువగా వాస్తున్నా, మొహం, చేతులు కూడా వాపులకు గురవుతున్నా ఎటువంటి అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి.
ఐవిఎఫ్, ఇక్సీ వంటి అత్యాధునిక వైద్య విధానాల ద్వారా సంతానవతులైనవారు కాళ్లవాపుల పట్ల నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. ఫెర్టిలిటీ నిపుణుల పర్యవేక్షణలో ఉండటం శ్రేయస్కరం.
నడుమునొప్పి : గర్భధారణ సమయంలో నడుము నొప్పి సహజం. నడుమును వంచకుండా తిన్నగా ఉంచి కూర్చోవడం, నిలబడటం వల్ల కొంతమేరకు ఉపశమనం లభిస్తుంది. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో గర్శిణీ ధరించిన వారు వైద్య నిపుణుల సలహా లేకుండా ఎటువంటి స్వంత చిట్కా వైద్యాలూ చేయకూడదు.
రక్తహీనత, ఆహారలోపం : గర్భవతులైన స్త్రీలలో రక్తహీనత, ఆహారలోపం మంచిదికాదు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లికి మాంసకృత్తులు, ఇనుము పుష్కలంగా ఉన్న ఆహారం చాలా అవసరం. చిక్కుళ్ళు, వేరుశనగ, కోడిమాంసం, పాలు, జున్ను, గుడ్లు, మాంసము, చేప, ఆకుపచ్చని ఆకుకూరలు తినడం వల్ల ఆమెకు కావలసిన పోషకపదార్థాలు లభిస్తాయి.
సంతాన సాఫల్యతా చికిత్సల ద్వారా గర్భవతులైన వారు విధిగా ఫెర్టిలిటీ నిపుణుల, న్యూట్రీషన్ నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం చాలా సమయాల్లో మేలు చేస్తుంది.
పొంగిన సిరలు : శరీరంలోని వివిధ భాగాల నుండి చెడు రక్తాన్ని గుండెకు తీసుకువెళ్ళే రక్తనాళాలను ‘సిరలు’ అంటారు. కడుపులో పెరుగుతున్న శిశువు బరువు ఒత్తిడి వల్ల కాళ్ళ నుంచి వచ్చే సిరలు పొంగడం సహజం. రాత్రి నిద్రపోయే సమయంలో కాళ్ళను కొంచెం ఎత్తులో (దిండుపై) ఉంచి నిద్రపోవడం మంచిది.
ఐవిఎఫ్, ఇక్సీ వంటి అత్యాధునిక వైద్య విధానాల ద్వారా గర్భిణీ ధరించిన స్త్రీలు ఫెర్టిలిటీ నిపుణుల సలహా మేరకు కొందరిలో పూర్తి విశ్రాంతి అవసరపడుతుంది.
మొలలవ్యాధి : ఇవి మలాశయంలో పొంగిన సిరలు. ఇవి గర్భంలో పెరుగుతున్న శిశువు బరువు వల్ల వస్తాయి. ఇందుకు అవసరమైన చిన్నపాటి మందులు వాడుతూ ఆహార నియంత్రణ పూర్తి విశ్రాంతి మేలు చేస్తుంది.
మలబద్దకం : గర్భిణీ స్త్రీలలో మలబద్దకం ఏర్పడటం తరచుగా సంభవించేదే! నీళ్ళను ధారాళంగా తాగడం ద్వారా, పండ్లను, పీచు పదార్థాలను తినడం ద్వారా మలబద్దకం సమస్యను పరిష్కరించవచ్చు.
అత్యాధునిక వైద్య చికిత్సా విధానాలైన ఐవిఎఫ్, ఇక్సీ, టీసా, డోనర్ ఇన్సెమినేషన్ వంటి చికిత్సల సహాయంతో గర్భవతులైన స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకుంటూ ఫెర్టిలిటీ నిపుణుల సలహాలు, సూచనలు విధిగా పాటించాల్సి ఉంటుంది.
గర్భంతో ఉన్నప్పుడు ప్రమాదకర లక్షణాలు : గర్భంతో ఉన్న సమయంలో రక్తస్రావమౌతున్నా, రక్తహీనత ఏర్పడినా, కాళ్ళు చేతులు మొహం వాపులు వస్తున్నా వీటిని ప్రమాదకర లక్షణాలుగా గుర్తించి, ఎటువంటి అశ్రద్ధ చేయకుండా వైద్య నిపుణుల పర్యవేక్షణలో సత్వర వైద్యసహాయం పొందవలసి ఉంటుంది.
సాధారణ గర్భిణీ సమయంలో నెలనెలా చెకప్ అసరమైతే ఐవిఎఫ్, ఇక్సీ వంటి చికిత్సల సహాయంతో గర్భిణీ ధరించిన వారు అవసరం మేరకు ప్రతి 15 రోజులకూ విధిగా చెకప్ చేయించుకోవలసి వస్తుంది. కడుపులో పిండం పెరుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ… శారీరకంగా తల్లికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించడం చాలా సమయాల్లో తల్లికీ పుట్టబోయే బిడ్డకూ మేలు చేస్తుంది.
– డా. కొల్లి రమాదేవి
MD, DNB,DGO (MRCOG), స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు, ఫోన్ : 92464 – 17882
Follow us in Socail Media Platforms: Facebook | Instagram | YouTube