ప్రసవానంతర సమస్యలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు |Postpartum Problems - Precautions to Take

Home /Postpartuum Problems-Precautions to Take

ప్రసవానంతర సమస్యలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రసవానంతర సమస్యలు- తీసుకోవాల్సిన |Postpartum Problems – Precautions to Take

గర్భం వచ్చిన తరువాత శరీరంలో జరిగిన మార్పులన్నీ సాధారణ స్థితికి రావడానికి డెలివరీ అయిన తరువాత కనీసం ఆరువారాల సమయం పడుతుంది. అంతర్జాతీయంగా, వివిధ దేశాల్లో జరిగిన వివిధ సర్వేల్లో ‘ప్రసవానంతరం చాలామందిలో ఏదో ఒక అస్వస్థత మిగిలిపోయి ఉంటుంది’ అని తేలింది.

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ప్రస్తుత కాలంలో జీవనవిధానం వేగం పుంజుకోవడంతో ప్రసవానంతరం సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో ఆధునిక మహిళలు వెనుకబడి ఉన్నారని చెప్పవచ్చు.

తమను గురించి తాము ఎటువంటి శ్రద్ధ వహించకపోగా, బిజీలైఫ్ పేరుతో అశ్రద్ధగా ఉంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. తరచుగా ఉండే హెల్త్ ప్రోబ్లమ్స్ తొందరగా అలసిపోవడం, నడుమునొప్పి, తరచుగా తలనొప్పి, మూత్రం ఎక్కువసార్లు అవ్వటం, దగ్గినా తుమ్మినా మూత్రం పడిపోవటం, మలబద్దకం, పైల్స్ సమస్యలు ఎదుర్కోవటం, బ్రెస్ట్ ప్రోబ్లమ్స్, మానసికంగా కృంగిపోవటం (డిఫ్రెషన్) ముఖ్యమైనవి.

క్లిష్టమైన కాన్పులు మరియు వాటి వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలు

పైన చెప్పిన లక్షణాలు డెలివరీ అయిన వెంటనే కనిపించవచ్చు… లేదా… మూడునెల్ల తరువాత కూడా కనిపించవచ్చు. కష్టమైన కాన్పులు – అనగా- ఫోర్సెప్స్ డెలివరీ, ఎమర్జెన్సీ, సిజేరియన్ల తరువాత ఈ ఆరోగ్యపరమైన సమస్యలు, శారీరక ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి. డెలివరీ సమయంలో రక్తస్రావం అధికంగా జరిగినట్లయితే రక్తహీనత ఏర్పడి తొందరగా అలసిపోవటం, ఏకాగ్రత లేకపోవటం, చికాకు, ఆకలి మందగించటం వగైరాలు ఉంటాయి.

క్లిష్టమైన కాన్పులు, అపరిశుభ్ర వాతావరణంలో డెలివరీ, ఎమర్జెన్సీ సిజేరియన్ ఆపరేషన్లు వంటి సందర్భాల్లో రక్తస్రావం అధికంగా అవటం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. తీవ్రతరమైన ఇటువంటి ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు చాలా సందర్భాల్లో, ప్రాణాపాయం సంభవించవచ్చు. జ్వరం రావటం, కుట్లు చీము పట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకమాదిరి ఇన్ఫెక్షన్లు సోకినట్లయితే పొత్తి కడుపులో నెప్పి అలాగే ఉండిపోవటం, సంభోగంలో నెప్పి, ఇన్ఫెర్టిలిటీ ప్రోబ్లమ్స్ ఎదురవుతాయి.

డెలివరీ తరువాత రక్తగడ్డకట్టడం, పక్షవాతం, మరియు ఇతర శారీరక ఇబ్బందులు

రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం- డెలివరీ అయిన ఆరేడురోజుల తరువాత జరగవచ్చు. అధిక బరువు ఉన్నవారిలో, కదలకుండా ఉన్నవారిలో ఆపరేషన్ అనంతరం డెలివరీ అయిన తర్వాత, 35 సంవత్సరాలు దాటినవారిలో రక్తనాళాలలో రక్తం గడ్డకట్టే సమస్య ఎక్కువగా ఉంటుంది. కాన్పు అయిన తర్వాత ద్రవ పదార్థాలు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. అలా తీసుకోనివారిలో మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల పక్షవాతం (పెరాలిసిస్) వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో బిపి అధికంగా ఉన్నట్లయితే డెలివరీ తరువాత కూడా గుర్రపువాతం ఫిట్స్ రావచ్చు. ఈ ఫిట్స్కు ముందు వచ్చే లక్షణాలు అనగా- తలనొప్పి, వాంతులు, ఉదరభాగంలో నెప్పి వంటి వాటిని అశ్రద్ధ చేయడం తగదు.

పెరీనియల్ కేర్- సాధారణ డెలివరీ తరువాత కుట్లు వేసినచోట (Episiotomy) రెండు నెలలవరకూ నెప్పి ఉండవచ్చు. ఫోర్సెప్స్ డెలివరీ అనంతరం రెండు నెలలు గడచిన తరువాత కూడా నెప్పి ఉండవచ్చు. సిజేరియన్ ఆపరేషన్ జరిగినవారికి పెరీనియల్ పెయిన్, దగ్గితే తుమ్మితే మూత్రం పడిపోవటం పైల్స్ కంప్లయింట్లు వంటివి ఉండవు. యూరినెరీ ఇన్ఫెక్షన్లు- డెలివరీ అయిన మొదటి సంవత్సరంలో మూడు నుంచి అయిదు శాతం మందిలో తరచుగా వస్తుంటాయి. ఇరవై శాతం మందిలో దగ్గినా తుమ్మినా మూత్రం పడిపోవటం (Stress Incontinence) డెలివరీ అయిన మూడునెలల తరువాత రావచ్చు.

కష్టమైన కాన్పు తరువాత వచ్చే మలవిసర్జన, డిప్రెషన్, మరియు బ్రెస్ట్ సమస్యలు

కష్టమైన కాన్పు తరువాత మల విసర్జన నాళం దగ్గర ఉండే కండరం దెబ్బతినటం లేదా నరాలు దెబ్బతినడం వల్ల, నాలుగుశాతం మందిలో మలవిసర్జన అదుపులో ఉండకపోవచ్చు. 20 శాతం మందిలో మలబద్దకం, 18 శాతం మందిలో పైల్స్ (మొలలు) రావటం జరుగుతుంది. అయితే- వీరిలో కొద్దిమందిలో మాత్రం పైల్స్ వాటంతట అవే తగ్గిపోవచ్చు. డెలివరీ అయిన 15 శాతం మందిలో డిప్రెషన్ సమస్య డెలివరీ అయిన మొదటి సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు.

త్వరగా అలసిపోవటం అనేది ఎక్కువమందిలో ఉంటూ ఉంటుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడే కాకుండా ఆ తర్వాత రెండు నెలల వరకూ కూడా అలసటకు తరచుగా గురికావచ్చు. బ్రెస్ట్ ప్రోబ్లమ్స్ – పాలిచ్చే తల్లుల్లో చనుమొనలు నెప్పిగా ఉండటం, పగుళ్ళు రావటం జరుగుతూ ఉంటాయి. అయితే- పాలిచ్చే సమయంలో బిడ్డను సరైన పొజిషన్లో ఉంచకపోవటం వల్ల ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. వక్షోజాలు నెప్పి రావటం, ఎర్రబడటం ఎప్పుడైనా జరగవచ్చు. ఇది లాక్టిఫెరల్ డక్ట్ బ్లాక్ అవ్వటంవల్ల వస్తుంటుంది. ఇదిలా ఉన్నప్పటికీ బిడ్డకు పాలివ్వటం ఆపకూడదు. పాలివ్వకుండా వదిలేసినట్లయితే వక్షోజాలకు చీముపట్టే ఆస్కారం ఉంటుంది.

ప్రసవానంతర సమస్యలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • డెలివరీకి ముందు, డెలివరీ అయిన తరువాత సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తల్లి ఆరోగ్యం పాడవ్వకుండా ఉ టుంది. బిడ్డ కూడా క్షేమంగా ఉంటుంది. ఆనందంగా బిడ్డను పెంచుకునే అవకాశం ఉంటుంది.
  • సరైన విశ్రాంతి (మధ్యాహ్నం 2 గంటలు నిద్ర, రాత్రి 8 గంటలకు నిద్ర), పోషకాహారం ఇవ్వటం తప్పనిసరి! ఆరువారాల వరకూ బిడ్డను పెంచటంలో మరో మనిషి సహాయం అవసరపడుతుంటుంది.
  • పాలిచ్చే తల్లులకు గర్భిణీ సమయంలో కంటే అదనంగా 700 క్యాలరీల ఆహారం అవసరమవుతుంది. పాలివ్వనివారికి గర్భిణీకి ఇచ్చే ఆహారం సరిపోతుంది.
  • ప్రొటీన్లు, పాలు అవసరం అవుతాయి. ఉదాహరణకి – అల్పాహారంలో మూడు చపాతీలు, పప్పుకూర, పెద్దగ్లాసు పాలు, మధ్యాహ్నం భోజనంలో మూడున్నర కప్పుల అన్నం, ఒక కప్పు పప్పు, కాయగూరలు, గుడ్లు, పెరుగు అవసరం. మధ్యాహ్నం పళ్ళు, పళ్ళరసాలు, పాలు, రాత్రి భోజనంలోకి మూడుకప్పుల కన్నా ఎక్కువగా అన్నం, పప్పు లేదా చికెన్, పళ్ళు, కాయగూరలు, రాత్రి నిద్రపోయే ముందు ఒక పెద్ద గ్లాసు నిండా పాలు అవసరం.
  • వీటికితోడుగా రోజుకు ఎనిమిది పెద్ద గ్లాసులకన్నా ఎక్కువగా కాచి వడబోసిన నీరు విధిగా తాగాలి. మలబద్దకం రాకుండా చూసుకోవాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకు 1 చొప్పున పాలిచ్చినంత కాలం వేసుకోవాలి. ఎక్సర్సైజులు చేయటంవలన నెప్పి తగ్గటం, డిప్రెషన్ రాకుండా ఉండటం జరుగుతుంది.
  • బ్రీథింగ్ ఎక్సర్సైజులు చేయటం, నిఠారుగా నడవటం కూడా అవసరమే! కూర్చుని పాలివ్వటం ఉత్తమం. శానిటరీ నాప్కిన్స్ వాడటం ఎప్పుడూ మంచిది! ఆరువారాలప్పుడు చెకప్ చేయించుకోవటం ఉత్తమం. ఏదైనా సమస్యలు ఉంటే వైద్యసహాయం తీసుకోవటం మంచిది. ఆరువారాల తరువాత మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా గర్భనిరోధక మాత్రలు వాడటం గానీ, లూప్ వేయించుకోవటం గానీ మంచిది.
  • బేబీకి సరైన సమయంలో వ్యాక్సిన్ వేయించడం అన్నింటికంటే ముఖ్యమైనది. డెలివరీ అయిన తర్వాత సమస్యలు రాకుండా ఉండాలంటే క్లిష్టమైన కాన్పులు కాకుండా చూసుకోవటం చాలా ముఖ్యమని చెప్పాలి.
  • తద్వారా పైన పేర్కొన్న ఇబ్బందుల్లో చాలావరకు ఉండవు. గర్భిణీ అని తెలిసినప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, తగిన ఆహారం, విశ్రాంతి తీసుకుంటూ, హాస్పిటల్ డెలివరీ అయ్యి, తగిన వైద్య సహాయం తీసుకోవటం వల్ల తల్లీ, బిడ్డా క్షేమంగా ఉండటమే కాకుండా ఇతరత్రా ఆరోగ్య సమస్యలనుంచి రక్షణ పొందవచ్చు.

డా॥ కొల్లి రమాదేవి,

M.D., DNB, DGO, (MRCOG)..

స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు, సెల్: 92464 17882

Follow us in Social Media Platforms: Facebook | Instagram | YouTube