పిసిఓ లక్షణాలు-జాగ్రత్తలు || PCO Symptoms & Precautions

పిసిఓ లక్షణాలు-జాగ్రత్తలు || PCO Symptoms & Precautions


చూడచక్కని రూపం అనూషది…! ఆమె నట్టింట నడుస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉందనే వారందరూ…! తమ గారాలపట్టిని కుటుంబసభ్యులందరూ అల్లారుముద్దుతో అపురూపంగా పెంచారు…! కోరిందల్లా ఇచ్చారు…! బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టిన కొద్దికాలానికి ఆరోగ్యపరంగా రకరకాల సమస్యలు తలెత్తడం ప్రారంభించాయి…! రుతుక్రమం సక్రమంగా రాకపోవడం, రెండు మూడు నెలలకోసారి మెన్సెస్ కావడం, రక్తస్రావం తక్కువగా గానీ, అధికంగాగానీ కావడం, పదిపదిహేను రోజుల వరకూ రక్తస్రావం జరగడం పరిపాటి అయ్యింది. రక్తహీనత, ఏ పనిమీదా ముఖ్యంగా చదువు మీద శ్రద్ధ లేకపోవడం, అవాంఛిత రోమాలు ఎక్కువ కావడం, ముఖం మీద మొటిమలు రావడం, తెలియకుండానే బరువు అధికంగా పెరగడంతోబాటు చర్మం మృదుత్వం పోయి గరుకుగా తయారయ్యింది.

ఫలితంగా- సన్నగా నాజూగ్గా ఉండే అనూష క్రమక్రమంగా అధికబరువుతో లావుగా, చర్మం కాంతి విహీనమై అవాంఛిత రోమాలతో ఎబ్బెట్టుగా మారిపోవడంతో ఆ అమ్మాయేనా ఈ అమ్మాయి అన్న సందేహం కలిగేది…! అమ్మాయిలో వచ్చిన ఈ తేడాను గమనించి వైద్యనిపుణులను సంప్రదిస్తే- ‘పి.సి.ఓ’గా నిర్ధారించారు!

టీనేజ్ అమ్మాయిలకు ఇటువంటి సమస్య ఉన్నట్లయితే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించి తక్షణ జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.

హార్మోన్ల సమతుల్యతాలోపం కారణంగా వాటిల్లే పిసిఓ లక్షణాలను ప్రారంభదశలో గుర్తించి, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం చెయ్యడంతోబాటు కొద్దిపాటి వైద్యచికిత్స పొందవలసి  ఉంటుంది. అలాగే- నిర్ణీత కాలంపాటు మందులు వాడటం ద్వారా నీటి బుడగలను అదుపు చెయ్యవచ్చు. ఇటువంటి సమస్యను అలక్ష్యం చేసినట్లయితే యవ్వనవతి అయిన దశనుంచి సుమారు 70 ఏళ్ళపైబడిన వయసు వరకూ పైన పేర్కొన్న సమస్యలతో బాటు బి.పి, గుండెజబ్బులకు గురికావడం., షుగర్ వ్యాధికి లోనయ్యే ప్రమాదం ఏర్పడటం., కాళ్ళు, చేతులు, గోళ్ళ అనారోగ్యం., క్రమేపీ ఆకలి మందగించడం., నీరసం నిస్సత్తువ ఆవహించడం., భవిష్యత్లో సంతానలేమి సమస్యలు వాటిల్లడం… వంటి పలు రకాల ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.

పిసిఓ బారిన పడకుండా ఉండాలంటే

అనువంశీకంగా కూడా విసిఓ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నట్లయితే బిడ్డ చిన్నతనం నుంచీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! 8-10 ఏళ్ళ వయసునుంచీ సమతుల ఆహారం అందజేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంచాలి. ముఖ్యంగా చాక్లెట్లూ, బిస్కట్లూ, చిప్స్, పిజ్జాలూ, బర్గర్లూ, ఐస్క్రీమ్లూ, కూల్డ్రింకులూ, ఫాస్ట్ఫుడ్స్, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలూ తీసుకోకూడదు. క్రమం తప్పని వ్యాయామం చేయడం ఎప్పుడూ మంచిది.

డా. కొల్లి రమాదేవి
MD, DNB,DGO (MRCOG), స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు, ఫోన్ : 92464 – 17882

Follow us in Socail Media Platforms: Facebook | Instagram | YouTube