లేట్ మ్యారేజ్, లేట్ ప్రెగ్నెన్సీతో అన్నీ సమస్యలే! |Late  Marriages Are Caused for Infertility Problems

కణం కణం కలిస్తే సృష్టిక్రమం-2

లేట్ మ్యారేజ్, లేట్ ప్రెగ్నెన్సీతో అన్నీ సమస్యలే! |Late  Marriages Are Caused for Infertility Problems

సుహాసిని సాఫ్ట్వేర్ ఇంజనీర్….! ఇంజనీరింగ్ పూర్తికావడంతోనే పేరున్న పెద్దకంపెనీలో మంచి ఉద్యోగం రావడం…. అతి తక్కువ కాలంలోనే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు రావడంతో ఉన్నత పదవులు లభించడంతోబాటు అయిదంకెల నెలజీతం అందుకోవడం జరిగింది.

గ్రూప్ మేనేజరుగా, టీమ్ లీడరుగా ఆమె కెరీర్ బ్రహ్మాండంగా నడుస్తోంది. బెంగుళూరులో స్వంత ఇల్లూ, కారుతో బాటు బ్యాంక్ బ్యాలెన్స్ బ్రహ్మాండంగా పెరిగింది. ప్రొఫెషనల్గా లక్ష్యసాధనపైనే దృష్టి కేంద్రీకరించిన సుహాసిని అనుకున్న స్థాయికి చేరే సరికి వయసు 30సం. దాటిపోయింది.

తెలియని వాళ్ళకంటే తెలిసిన వాళ్ళయితేనే మంచిదని అనుకుని, అదే కంపెనీలో పనిచేస్తున్న కొలీగ్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఏ బాదరబందీ లేకుండా ఓ రెండేళ్ళపాటు హాయిగా ఉండాలనుకుని కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించారు.

రెండేళ్ళ తరువాత పిల్లలు కావాలనుకుని ఓ ఏడాదిపాటు ప్రయత్నం చేసినా పిల్లలు కలుగకపోవడంతో ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నారు. గర్భిణీ వచ్చింది. ఆలస్యంగా గర్భిణీ రావడంతో అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో మొదటి రెండుమూడు నెలలు బాగా విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు.

బాగా విశ్రాంతి తీసుకుంటూన్న ఈ సమయంలోనే మధ్యమధ్యలో బ్లీడింగ్ కావడంతో థ్రెటనింగ్ అబార్షనంటూ ఆస్పత్రిలో జాయిన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మందులు వాడటం, ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం వల్ల ఎలాగైతేనేం గండం గడిచింది. పిండం నిలబడింది.

మూడోనెల వచ్చేటప్పటికి స్క్రీనింగ్ టెస్టుల్లో షుగర్ వ్యాధి బయటపడింది. అపురూపంగా వచ్చిన గర్భిణీ కావడంతో హైక్యాలరీ డైట్ తీసుకోవడం, ఎక్కువ విశ్రాంతి పొందడం, ఆలస్యంగా గర్భిణీ ధరించడం వల్లనే షుగర్ వచ్చిందని డాక్టర్లు నిర్ధారించారు.

ఈ విధంగా గర్భిణీ సమయంలో వచ్చిన షుగర్ వ్యాధి ప్రసవం జరిగేంత వరకూ ఉంటుందనీ, తగిన జాగ్రత్తలు విధిగా తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచించారు. ప్రతిరోజూ ఇన్సులెన్ ఇంజక్షన్లు, బ్లడెస్టులు చేయించుకోవడం, డాక్టర్ల సూచనల మేరకు మితంగా ఆహారం తీసుకోవడంతో షుగర్ వ్యాధి అదుపులోకి వచ్చింది.

షుగర్ వ్యాధి చికిత్సను సరిగ్గా తీసుకోనట్లయితే పుట్టే బేబీకి అవయవలోపం ఏర్పడే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడంతో సుహాసిని మరింత జాగ్రత్త వహించి షుగర్ను కంట్రోల్లోకి వచ్చేటట్లుగా డాక్టర్లతో సహకరించింది. ఎలాగైతేనేం షుగర్ను అదుపులోకి తెచ్చిన వైద్య నిపుణులు లేట్ ప్రెగ్నెన్సీ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు.

ఆల్ట్రాసౌండ్ స్కానింగ్లో న్యూకల్ థిక్నెస్ చూడటం, ట్రిపుల్ టెస్ట్వంటి రక్తపరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఎనామలీ పరీక్షలు కూడా నిర్వహించారు. స్కానింగ్, రక్త పరీక్షల్లో ఏమైనా తేడాలున్నట్లయితే అబార్షన్ చెయ్యాల్సి వస్తుందని డాక్టర్లు ముందుగానే చెప్పడంతో సుహాసిని చాలా టెన్షన్ ఫీలయ్యింది.

ఈ పరీక్షల్లో ఎటువంటి తేడాలూ లేకపోవడంతో సుహాసినితో బాటు డాక్టర్లు కూడా హమ్మయ్య అనుకున్నారు. నాలుగెళ్ళి అయిదు వచ్చింది. కడుపులో బిడ్డ కొద్దిగా కదలికలు ప్రారంభించింది. నెలకోసారి పరీక్షల బదులు ప్రతి 15 రోజులకూ రొటీన్ ఏంటినేటల్ చెకప్ చేయించుకుంటోంది.

పరిస్థితి సజావుగానే ఉందనుకుంటున్న సమయంలో కాళ్ళు చేతులు వాపులు రావడం మొదలయ్యింది. అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు అమ్మాయికి హై బీపీ వచ్చిందని నిర్ధారించారు. ఈ సమయంలో హై బిపి రావడం మంచిది కాదనీ, దీనివల్ల కడుపులో బిడ్డ సరిగ్గా పెరగకపోవడం లేదా తల్లికి గుర్రపువాతం రావడం, కొంతమందిలో మాయ విడిపోవడం మున్నగు సమస్యలు రావచ్చునని చెప్పారు.

షుగరూ, బిపి కంట్రోలులోకి రాకపోతే ఎక్కువ సందర్భాలలో తల్లికీ బిడ్డకీ కూడా అపాయం సంభవించవచ్చునంటూ ముందు జాగ్రత్త చర్యగా సుహాసినిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయిదో నెల వెళ్ళి ఆరోనెల వచ్చింది. కొద్దిరోజుల పాటు వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందడంతో బిపి, షుగర్ కంట్రోలులోకి వచ్చాయి. సుహాసిని డిశ్చార్జ్ అయ్యింది.

రకరకాల టెన్షన్ల మధ్య ఏడో నెలలోకి ప్రవేశించిన తర్వాత చూసుకుంటే – ముందుగా భయపడినట్లుగానే కడుపులో బిడ్డ పెరుగుదల తగినంత స్థాయిలో లేదని తేలింది. వైద్య పరిభాషలో దీనిని ఐ.యు.జి.ఆర్. అంటారు. మళ్ళీ హాస్పిటల్ అడ్మిషన్, కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమయ్యింది.

షుగర్ కంట్రోలు కోసం ప్రతిరోజూ బ్లడెస్టులు, బిపి మానిటరింగ్ వంటివి రొటీన్ గా మారాయి. ఏ కాంప్లికేషన్ వచ్చినా – అంటే – బిపి కంట్రోలులోకి రాకపోయినా, ఫిట్స్ వచ్చే అవకాశాలు కనిపించినా, బేబీకి రక్తప్రసారం తగ్గినా వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పారు. ఇలాంటి స్థితిలో మామూలు కాన్పయ్యే అవకాశం లేదు.

వారానికి రెండుమూడుసార్లు స్కానింగులు అవసరమయ్యాయి. ఎప్పటికప్పుడే ‘ఈ రోజు గడిచింది…. హమ్మయ్య. అనుకుంటూండగానే ఎనిమిదోనెల ప్రవేశించి పదిరోజులు గడిచాయి. నెలలు పెరుగుతున్న కొద్దీ బిపి పూర్తి కంట్రోలులోకి రాకపోవడమే కాకుండా మూత్రంలో అల్బుమిన్ పోవడం, కాళ్ళూ చేతులూ మొహం మరింత వాపు రావడం, ఒంట్లో నీరు చేరడం జరిగింది.

పరిస్థితి తీవ్రతను బట్టి మరికొద్ది రోజుల్లో ఆపరేషన్ చేయాల్సి వస్తుందనుకుంటూండగానే పరిస్థితి ముంచుకొచ్చింది. సుహాసినికి ఉన్నట్టుండి కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అత్యవసరంగా స్కానింగ్ చేసి చూస్తే – లోపల మాయ విడిపోయినట్లు తేలింది.

తల్లికీ బిడ్డకీ ప్రమాదం అంటూ వెంటనే ఎమర్జెన్సీ సిజేరియన్ ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీశారు. నెలలు నిండకుండానే డెలివరీ కావడం, తల్లికి షుగర్ వ్యాధికూడా ఉండటం వల్ల బేబీకి ఊపిరితిత్తులు సక్రమంగా పని చెయ్యకపోవడంతో బేబీని పిల్లల వైద్యనిపుణుల పర్యవేక్షణలో వెంటిలేటర్పై ఉంచాల్సి వచ్చింది.

తల్లికి ప్రాణాపాయం తప్పింది గానీ, బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందంటూ డాక్టర్లు చెప్పారు. సుమారు ఒక నెల్లాళ్ళ పాటు ప్రత్యేక వైద్య చికిత్సల సహాయంతో బిడ్డను దక్కించుకోగలిగారు. ఆ తర్వాత బిడ్డ ఎదిగే సమయంలో కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందనీ, ముఖ్యంగా మొదటి ఒకటి రెండు సంవత్సరాల పాటు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని డాక్టర్లు హెచ్చరించారు.

సుహాసిని గర్భం ధరించిన మొదట్నుంచీ వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే ఉన్నప్పటికీ కాంప్లికేషన్స్ రావడం తప్పలేదు. ఆడుతూ పాడుతూ సరదాగా ఆస్వాదించాల్సిన గర్భిణీ సమయం ఈ విధంగా కాంప్లికేషన్స్ మయం కావడానికి లేట్ మ్యారేజ్, లేట్ ప్రెగ్నెన్సీ కారణం అంటే ఆశ్చర్యం కలుగకమానదు.

20-29 మధ్య వయసులో ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే నూటికి 95 మందిలో గర్భిణీ సమయంలో ఎటువంటి సమస్యలూ ఉత్పన్నం కావని గమనించవలసి ఉంటుంది. అందుకే వయసు పైబడిన తరువాత గర్భిణీ ధరించిన సందర్భాలలో ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో తగిన చికిత్స పొందడం అత్యవసరంగా భావించాల్సి ఉంటుంది.

– డా. కొల్లి రమాదేవి

MD, DNB,DGO (MRCOG), స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు, ఫోన్ : 92464 – 17882

Follow us in Socail Media Platforms: Facebook | Instagram | YouTube