కణం కణం కలిస్తే సృష్టిక్రమం-2 ||Creation is when particle meets particle

కణం కణం కలిస్తే సృష్టిక్రమం-2

కణం కణం కలిస్తే సృష్టిక్రమం-2

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక ఫెర్టిలిటీ సెంటర్లు పనిచేస్తూ లక్షల సంఖ్యలో నూతన శిశువులకు ఊపిరి పోస్తున్నాయి.1978 తరువాత క్రమక్రమంగా అభివృద్ధి చెందిన ఫెర్టిలిటీ ప్రక్రియ 1980-85 మధ్యకాలంలో నాలుగు నుంచి 10 శాతం మధ్య ఫలితాలు సాధించగా – ప్రస్తుతం ప్రతి ఒక్కసారికీ సుమారు 40 శాతం ఫలితాన్ని అందిస్తోంది. | కణం కణం కలిస్తే సృష్టిక్రమం-2

ఐ.వి.ఎఫ్. ఎలా చేస్తారు? ఎవరికి ఉపయోగం?

స్త్రీ ఫెలోపియన్ ట్యూబులో సహజంగా జరిగే ప్రక్రియను కృత్రిమంగా ఐవిఎఫ్ లాబ్లో నిర్వహించి, ఫలదీకరణ చెందిన పిండాన్ని స్త్రీ గర్భసంచిలో ప్రవేశపెట్టడాన్నే ఐవిఎఫ్ ప్రక్రియగా చెప్పవచ్చు. అంటే- స్త్రీ అండవాహిక (ఫెలోపియన్ ట్యూబ్)లో జరిగే సహజమైనఫలదీకరణ ప్రక్రియకు వీలుగా అక్కడ ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా ఐ.వి.ఎఫ్.లాబ్లో ఏర్పరచి పిండోత్పత్తి జరిగేటట్లుగా చేయడమే ఐవిఎఫ్ విధానం. 

దీనినే మనం మరో విధంగా చెప్పుకోవాలంటే- సహజంగా జరిగే సంతానోత్పత్తి ప్రక్రియకు కలిగే అవాంతరాలను అధిగమించి సంతానోత్పత్తి జరిగేందుకు సహకరించే సహాయతా ప్రక్రియగా ఐవిఎఫ్ను భావించవచ్చు. 

అందువల్లనే దీనిని అసిస్టెడ్ రీ ప్రొడెక్టివ్ టెక్నిక్ – ART అంటారు. ఇది ట్యూబులు పూర్తిగా మూసుకుపోయినవారికి. ట్యూబెక్టమీ ఆపరేషన్ జరిగిన తరువాత మళ్ళీ పిల్లలు కావాలనుకున్నప్పుడు, ఐయుఐ విధానం అయిదారుసార్లు ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కానప్పుడు, ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు, 35 సంవత్సరాలు పైబడిన స్త్రీలకు, పురుషులలో వీర్యకణాలు తక్కువగా ఉన్నప్పుడు, అలాగే- అన్ ఎక్స్టెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ ఉన్నప్పుడు టెస్ట్యూబ్ ప్రక్రియ వల్ల సంతానం పొందవచ్చు.

నాలుగు దశలుగా నిర్వహించే ఈ ప్రక్రియ సంతాన సాఫల్యత కోసం ఎదురుచూసే దంపతులకు ఒక వరంగానే చెప్పవచ్చు.

మొదటి దశ (Suppressing Natural Cycle) (హార్మోన్ల స్థాయి స్థిరీకరించడం):

నెలసరి వచ్చిన 18 నుంచి 23 రోజులలోపు హార్మోన్ ఇంజక్షన్లు (GNRH-A) ఇచ్చి సహజంగా ఉండే హార్మోన్ల స్థాయి తగ్గించవలసి ఉంటుంది. ఇది సుమారుగా 10 నుంచి 15 రోజులపాటు ప్రతిరోజూ పొందవలసి ఉంటుంది.

రెండవ దశ (Ovarian stimulation) (అండోత్పత్తి):

మొదటి దశ ముగిసిన తరువాత రెండో నెలలో నెలసరి వచ్చిన రెండో రోజున హార్మోన్ల స్థాయిని పరీక్షించి అండాలను ప్రేరేపించేందుకు అనువుగా గొనెడో ట్రోఫిన్స్ అనే ఇంజక్షన్ ఇవ్వవలసి ఉంటుంది. ఇది సుమారుగా 10 నుంచి 12 రోజులపాటు ప్రతిరోజూ వైద్యుల పర్యవేక్షణలో పొందాలి. 

ఇందుకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సహకారం తప్పనిసరి. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్, హార్మోన్ పరీక్షల ద్వారా హార్మోన్ ఇంజక్షన్ల మోతాదును నిర్ణయిస్తారు. దీని వల్ల అండాలు మరీ ఎక్కువగానూ లేదా మరీ
తక్కువగానూ స్పందించకుండా ఒకేవిధంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. 

హార్మోన్ల ఇంజక్షన్లు సరైన మోతాదులో పొందడం వల్ల అండాశయాలలో ఉండే అండ సముదాయం (సుమారు 8 నుంచి 10) ఒకే పరిమాణంలో ఉండేటట్లు వీలవుతుంది. ఇదే సమయంలో GNRHA ఇంజక్షన్లు కూడా కొనసాగించవలసి వస్తుంది.

మూడో దశ (IVF-ET) (ఐవిఎఫ్ మరియు ఎంబ్రియో ట్రాన్సఫర్):

అండాలు (పాలికిల్స్) సుమారు 18 నుంచి 20 మిల్లీమీటర్ల సైజుకు చేరుకోగానే పరిపక్వత చెందడం కోసం HCG అనే ఇంజక్షన్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఇంజక్షన్ పొందిన 34 నుంచి 36 గంటలలోపు అండాలను బయటకు తీయవలసి ఉంటుంది. 

అండాలను వెలికి తీసేందుకు వెజైనల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ప్రోబికి ఎగ్పికప్ సూదిని అమర్చి, మత్తుమందు ఇచ్చి, యోని ద్వారా అండాలను సేకరిస్తారు. ఈ సేకరించిన అండాలను ఇంక్యుబేటర్లో ఉంచుతారు. అదే సమమయంలో భర్త వీర్యకణాలను సేకరించి, శుద్ధి పరచి, కదలికలు ఎక్కువగా ఉన్న వీర్యకణాలతో అండాలను సంయోగపరచి ఇంక్యుబేటర్లో సుమారు 48 గంటల నుంచి 120 గంటలపాటు ఉంచుతారు. 

ఇవి అండదశ నుంచి పిండదశకు చేరుకునేంత వరకూ నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. పిండం రూపుదిద్దుకున్న తరువాత నాలుగు కణాలు 8 కణాల దశలో గానీ, లేదా బ్లాస్టోసిస్ట్ దశలోగానీ టెస్లాన్ ట్యూబ్ ద్వారా భార్య గర్భకోశంలో ప్రవేశపెడతారు.

నాలుగో దశ (Encouraging implantation):

ఎంబ్రియా ట్రాన్స్ఫర్ తరువాత గర్భసంచిలో పిండం ఇమిడి పోవడానికి ప్రొజెస్టిరోన్ టాబ్లెట్స్, మరియు ఇంజక్షన్లు 15 రోజులపాటు ఇవ్వవలసి ఉంటుంది. అనంతరం ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్వహించి గర్భిణీని నిర్ధారిస్తారు. స్త్రీ శరీరంలో సహజంగా ఉండే వాతావరణం, జరిగే ప్రక్రియలను లాబ్లో కృత్రిమంగా కల్పించడం ఈ ఐవిఎఫ్ ప్రక్రియలో అత్యంత విశిష్టమైనది మరియు సురక్షితమైనది.

– డా. కొల్లి రమాదేవి

MD, DNB,DGO (MRCOG), స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు, ఫోన్ : 92464 – 17882

Follow us in Socail Media Platforms: Facebook | Instagram | YouTube