కణం కణం కలిస్తే సృష్టిక్రమం ||Creation is when particle meets particle

కణం కణం కలిస్తే సృష్టిక్రమం

కణం కణం కలిస్తే సృష్టిక్రమం ||Creation is when particle meets particle

మానవశరీరం కోటానుకోట్ల కణాల సముదాయం…! అందులో వీర్యకణం ఒక కణం..! అలాగే అండం ఒక కణం..! మానవ పునరుత్పత్తిలో ప్రధాన భూమిక నిర్వహించే ఈ రెండు కణాల కలయికనే సృష్టిక్రమంగా ఆధునిక వైద్యశాస్త్రం చెబుతుంది…! కణం కణం కలిస్తే సృష్టిక్రమం


రుతుక్రమం సక్రమంగా సరైన సమయంలో వచ్చే స్త్రీలలో ప్రతినెలా అండాశయం నుంచి ఒక అండం విడుదల కావడం జరుగుతుంది. ఇది నెలసరి తేదీ నుంచి 12 లేదా 14 రోజుల వ్యవధిలో విడుదలవుతుంది. ఈ విడుదలైన అండము ఫెలోపియన్ ట్యూటు చివర ఉండే ఫింబ్రియాల సహాయంతో ట్యూబు మధ్య భాగమైన యాంప్యుల్లాలోకి చేరుతుంది. అండం
విడుదలైన 24 గంటలలోపు వీర్యకణాలు అండాన్ని చేరుకున్నట్లయితే అండముతో వీర్యకణ సంయోగము జరిగి జగోట్ ఏర్పడుతుంది. దీనినే ఫలదీకరణము లేదా ఫెర్టిలైజేషన్ అంటారు.

ఫలదీకరణము చెందిన జగోట్ 24 నుంచి 30 గంటలలోపు కణవిభజన జరిగి రెండు కణాలుగా అభివృద్ధి చెందుతుంది.

ఇవి ఫెలోపియన్ ట్యూబులోని సీలియాల కదలిక మరియు ట్యూబులోని కండరాల సహాయంతో నెమ్మదిగా గర్భసంచి కుహరం వైపు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణ కాలవ్యవధి సుమారు అయిదారు రోజులు పడుతుండగా ప్రయాణం ప్రారంభించిన 12 గంటల వ్యవధిలో రెండు కణాలు నాలుగు కణాలుగా అభివృద్ధి చెందుతాయి. 

ఈ అభివృద్ధి నిరంతరంగా జరుగుతూ నాలుగు
కణాలు ఎనిమిది, ఎనిమిది 16గా, 16 కణాలు 32గా … ఇలా క్రమ క్రమంగా అభివృద్ధి చెందుతాయి. 

ఈవిధంగా అభివృద్ధి చెందిన కణాల సముదాయం (సుమారు 50 కణాలు ఉండవచ్చు) ఒక బంతి (మార్యులా)గా అభివృద్ధి చెంది గర్భసంచి కుహరాన్ని చేరుకుంటుంది. గర్భసంచి కుహరంలో ఉండే ద్రవాలలో ఈ కణ సముదాయం తేలుతూ మరింతగా అభివృద్ధి చెంది బ్లాస్టోసిస్ట్ (సుమారు 200 కణాల సముదాయం)గా ఏర్పడుతుంది. అనంతరం గర్భసంచిలో ఉండే ఎండోమెట్రియమ్లోకి బ్లాస్టోసిస్ట్ చొచ్చుకునిపోతుంది. 

ఇంతటి బృహత్తర కార్యక్రమ నిర్వహణ ఫలదీకరణ జరిగిన అయిదారు రోజుల్లోనే జరగడం సృష్టిరహస్యంగా భావించవచ్చు.

గర్భసంచి కుహరంలో బ్లాస్టోసిస్ట్ స్థిరపడి క్రమక్రమంగా అండం పిండంగా, పిండం ఎంబ్రియోగా, ఎంబ్రియో శిశువుగా రూపాంతరం చెందుతుంది. అంటే- ఈ బ్లాస్టోసిస్ట్ గర్భసంచి గోడలకు పదో రోజునాటికి అతుక్కుని స్థిరపడి ప్రెగెన్నీ హార్మోన్ (బీటాహెచ్.సి.జి) విడుదల చేయడం మొదలు పెడుతుంది. 

దీనినే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ గా గుర్తించి గర్భిణీని నిర్ధారిస్తాం. ఇదంతా ప్రకృతిపరంగా స్త్రీ శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ. ఇది పూర్తి ఆరోగ్యంగా ఉంటూ, ప్రతినెలా అండం విడుదల అవుతూ, ఫెలోపియన్ ట్యూబుల పనితీరు సక్రమంగా ఉండి, గర్భసంచి నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా ఉండటమే కాకుండా గర్భసంచిలోని ఎండ్రోమెట్రియమ్ పొర తగినంత మందంగా ఉండి పిండాన్ని అమర్చుకోగలిగి ఉన్నట్లయితే సహజంగా సక్రమంగా జరిగే సాధారణ గర్భధారణ స్థితి ఇది!

అలాగే-పురుషులలో వీర్యకణాల సంఖ్య, కదలికలు, సారూప్యతతో అండంతో కలసి ఫలదీకరణచెందే శక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది.

అంటే- ఒక స్త్రీ గర్భవతి అయ్యిందంటే సాధారణ స్థితిలో భార్యాభర్తల ఆరోగ్యము, పునరుత్పత్తి సామర్థ్యము బాగా ఉన్నాయని చెప్పవచ్చు. ఒక ఏడాదికి మించి కలిసి కాపురం చేస్తున్నా సంతానం కలగలేదంటే- భార్యాభర్తల సాధారణ ఆరోగ్య స్థితిలో తేడా ఉందని అనుమానించి వైద్యనిపుణుల సలహా పొందవలసి వుంటుంది. 

పూర్వపు రోజుల్లో ఫెలోపియన్ ట్యూబులు ఏ కారణం చేతనైనా మూసుకుపోవడం, వీర్యకణాలు తగినన్ని లేకపోవడం వంటి కారణాలు ఉన్నట్లయితే గర్భిణీ వచ్చే అవకాశం ఎంతమాత్రం ఉండేది కాదు! 

వీరు నిస్సంతువులుగా మిగిలిపోయేవారు. ఇటువంటి సమయంలో ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తల అవిరళ కృషి ఫలితంగా మనకు అందుబాటులోకి వచ్చిన అత్యద్భుతమే ఐవిఎఫ్ ప్రక్రియ.


1978 ప్రాంతంలో బ్రిటన్కు చెందిన డా.పాట్రిక్ స్ట్రెప్టోయ్. డా. రాబర్ట్ ఎడ్వర్డ్స్ విశేష పరిశోధన ప్రయోగాలు ఫలించి ప్రపంచంలోనే ప్రప్రధమ టెస్ట్యూబ్ బేబీ (లూయీస్ బ్రౌన్) ఊపిరి పోసుకుంది. 

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంచలనం సృష్టించింది. అప్పటి వరకూ సంతానసాఫల్యత ఆ భగవంతుని కరుణగా భావించే ప్రజానీకం ఈ అత్యాధునిక ఆవిష్కరణతో కొత్త
ఆలోచన దిశగా అడుగులు వేసింది. ఈ ప్రక్రియను కనిపెట్టిన డా. పాట్రిక్ స్ట్రెప్టోయ్, డా. రాబర్ట్ ఎడ్వర్డ్స్ కు నోబుల్ బహుమతి లభించింది కూడా!

డా. కొల్లి రమాదేవి

MD, DNB,DGO (MRCOG), స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు, ఫోన్ : 92464 – 17882

Follow us in Socail Media Platforms: Facebook | Instagram | YouTube