Endometriosis Also A Reason For Infertility
సంతానలేమికి ఎండోమెట్రియోసిస్ కూడా ఓ కారణమే! || Endometriosis Also A Reason For Infertility
జమున యుక్త వయస్కురాలైన ఒకటి రెండు సంవత్సరాల నుంచే నెలసరి సమయంలో నెప్పి రావడం మొదలయ్యింది. ‘ఇది సాధారణమేలే’ అనుకుంటూ ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. పెళ్ళయ్యింది. ఆ తర్వాత కూడా ఇది అలాగే కొనసాగింది. ‘పిల్లలు పుడితే తగ్గిపోతుందనుకుంటూ ఒకటి రెండు సంవత్సరాలు గడిపారు. పిల్లలు పుట్టకపోగా నెప్పి తీవ్రత భరించలేనంతగా పెరగడంతో గబగబా డాక్టరు వద్ద కెళ్ళారు. వైద్య పరీక్షల తరువాత చాక్లెట్ సిస్టు ఉందంటూ తేల్చారు. దీన్నే వైద్యపరిభాషలో ఎండోమెట్రియోసిస్ (Endometriosis Problem) అని వ్యవహరిస్తారు…!
స్త్రీలలో యుటిరస్ (గర్భసంచి) లోపలిపొరను ఎండోమెట్రియమ్ అంటారు. రుతుక్రమం జరిగిన తరువాత ఈ ఎండోమెట్రియమ్ పొర ఒక మిల్లీ మీటరు నుంచి నెలసరి వచ్చే సరికి 20 మిల్లీ మీటర్ల వరకూ మందం పెరుగుతుంది. బహిష్టు సమయంలో డిశ్చార్జి రూపంలో ఈ పొర బయటకు వచ్చేస్తుంది. ఇది ప్రతీనెలా జరిగే సాధారణ ప్రక్రియే! ఎండోమెట్రియోసిస్ ఉన్న వారిలో ఈ పొర గర్భసంచి లోపలకు అంటే మయోమెట్రియమ్ లోనికి చొచ్చుకుని పోతుంది. ఈ స్థితిని అడినోమయోసిస్ అంటారు.
మరికొంతమందిలో ఈ ఎండోమెట్రియల్ పొర గర్భసంచి బయటకు అనగా అండాశయాలలో వృద్ధిచెంది చాక్లెట్ సిస్ట్గానూ, గర్భసంచి చుట్టూ వ్యాపించి పెల్విక్ ఎండోమెట్రియోసిస్ గానూ, రెక్టో వెజైనల్ ఎండోమెట్రియోసిస్ నూ, పెరిటోనియల్ఎం డోమెట్రియోసిస్ గానూ వృద్ధి చెంది, మూత్రాశయం, మూత్రనాళికలు, పేగులకూ కూడా వ్యాపిస్తుంది. ఈ ఎండోమెట్రియమ్ పొర ఎక్కడ ఉన్నా రుతుక్రమంలోని హార్మోన్లకు స్పందించి రుతుక్రమ సమయం దగ్గర కొచ్చే కొద్దీ గర్భసంచీ పొరలాగే మందం పెరిగి, స్రవిస్తూ, బయటకు రాలేక సిస్టులుగా మారుతుంది. దీని వల్ల బహిష్టు సమయంలో తీవ్రమైన నెప్పి కలుగుతుంది. ఇది ఏ వయసులోనైనా రావచ్చు, ఏ వయసు వారికైనా రావచ్చు…!
ఎండోమెట్రియోసిస్ లక్షణాలు :
ఎండోమెట్రియోసిస్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు చాలా మందిలో ఏ విధమైన ఇబ్బందీ ఉండదు. కొద్దిమందిలో ప్రతినెలా వచ్చే నెలసరి నెప్పి తీవ్రత నెలనెలకూ అధికమవుతుంది. పొత్తికడుపులో నెప్పి, నడుము నెప్పి ఉండటం, అధిక రక్తస్రావం జరగటం, సంభోగ సమయంలో నెప్పి కలగటం, నెలసరి వచ్చేందుకు నాలుగైదు రోజుల ముందు కొద్దికొద్దిగా బ్లీడింగ్ కనిపించిన తరువాత రుతుక్రమం జరగటం వంటి లక్షణాలు ఎండోమెట్రియోసిస్కు సంబంధించినవిగా గుర్తించవచ్చు.
ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎవరిలో ఎక్కువ ? :
తల్లికి ఉంటే పిల్లలకూ ఫెమిలియల్గా వస్తుంది. ఒకరిద్దరు మాత్రమే పిల్లలు ఉన్నవారికి, అసలు సంతానం లేనివారికి, గర్భసంచి నిర్మాణంలో తేడాలు ఉన్నవారికి ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ..! ప్రతి 15 లేదా 20 రోజులకు నెలసరి రావడం, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయ్యేవారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 20 నుంచి 30 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలో 15 శాతం మందికి ఎండోమెట్రియోసిస్ వ్యాధి ఉంటుందని అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వీరిలో సగం మందికి సంతానలేమి సమస్యగా పరిణమిస్తోందని ఆసర్వేలలో తేలింది.
వ్యాధి నిర్ధారణ :
ఈ వ్యాధిలక్షణాలతో తమ వద్దకు వచ్చిన స్త్రీలకు గైనకాలజిస్టులు పెల్విక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు పొత్తికడుపులో నెప్పిగా ఉండటం, గర్భసంచి కదలిక లేకుండా అతుక్కుని ఉండటం, అండాశయాలు పెద్దవిగా ఉండటం ఎండోమెట్రియోసిస్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. అలాగే- అండాశయాలలో సిస్టులు వెల్వెటీ అపియరెన్స్తో ఉండటం కూడా దీని ప్రత్యేకతగా చెబుతారు. ఈ
సిస్టులో చిక్కటిద్రవం చాక్లెట్ రంగులో ఉండటంతో దీనిని చాక్లెట్ సిస్టుగా వ్యవహరిస్తారు. ట్రాన్స్ వెజైనల్ ఆల్ట్రాసౌండ్ ఎగ్జామ్ చేయడం ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. ఒకవైపు అండాశయంలో గానీ… లేదా.. రెండు వైపులా అండాశయాలలో గానీ ఈ సిస్టులు ఉండవచ్చు.
గర్భసంచికి చాలా దగ్గరగా అతుక్కుని ఉండటాన్ని కూడా స్కానింగ్ ద్వారా గుర్తించవచ్చు. అలాగే- డాప్లర్ పరీక్ష చేసినప్పుడు సిస్టులో రక్తప్రసరణ లేకపోవడం వల్ల చాక్లెట్ సిస్టులను మిగతా వెరైటీ సిస్టుల నుంచి ప్రత్యేకంగా గుర్తించవచ్చు. ఎం.ఆర్.ఐ. స్కాన్ చేసినప్పుడు ఎండోమెట్రియోసిస్ను తేలికగా గుర్తించడంతో బాటు వ్యాధి ఏ దశలో ఉన్నదీ ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. ఏ విధమైన లక్షణాలూ లేకపోయినప్పటికీ లాపరోస్కోపీ విధానం ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు, ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారికి రక్తంలో సిఎ125 లెవెల్స్ పెరుగుతాయి.
చికిత్స:
వయసు, వ్యాధి తీవ్రత, సంతానలేమి సమస్యను బట్టి చికిత్సలు ఆధారపడిఉంటాయి. మందులతోనూ, ఆపరేషన్ ద్వారానూ, కొద్దిమందిలో రెండు విధానాలనూ అమలు జేస్తూ చికిత్స అందించవలసివస్తుంది.
మెడికల్ ట్రీట్మెంట్ :
కంబైన్డ్ ఓరల్ కాంట్రాసెక్టివ్ పిల్స్, ప్రొజెస్టిరోన్, డానోజోల్, జెనోన్, జి.ఎన్.ఆర్. హెచ్. ఎనలాక్స్ మరియు జి.ఎన్.ఆర్.హెచ్. యాంటగొనెస్ట్ మొదలైనవి పేషంట్ అవసరాన్ని బట్టి వాడవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి ఈ మందులు మూడు నుంచి ఆరునెలల వరకూ ఇవ్వవలసి ఉంటుంది. ఆపరేషన్ చేయడానికి మూడు నెలల ముందునుండి ఆపరేషన్ అయిన ఆర్నెల్ల వరకూ ఈ
మందుల ద్వారా చికిత్స విధానం నడుస్తూ ఉంటుంది.
సర్జికల్ ట్రీట్మెంట్ :
లాపరోస్కోపీ విధానం ద్వారా సిస్టులను తొలగించడం, గర్భసంచీ చుట్టూ ఉన్న ఎడిహిషన్స్ వంటి అతుకులు తొలగించడం, 40 నుండి 60 వాట్స్ ఎలక్ట్రిక్ కరెంటును ఉపయోగించి గానీ, సిఓ, లేజర్ లేదా నాడాగ్ లేజర్ ఉపయోగించి గానీ ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ను తొలగించడం జరుగుతుంది. మూత్రనాళాలకూ, మూత్రకోశానికీ, రక్తనాళాలకీ, పేగులకూ వ్యాపించి ఉన్న ఎండో మెట్రియోసిస్ నన్ను సిఓ లేజర్ ద్వారా తొలగిస్తారు. ఆల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చాక్లెట్ సిస్టులను అదుపు చేయవచ్చు.
పిల్లలు ఉన్న వారికి ఈ వ్యాధి వచ్చినట్లయితే గర్భసంచి తొలగించడమే శ్రేయస్కరం. పిల్లలు లేని వారికి ఈ వ్యాధి ప్రారంభదశలో ఉన్నప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీగా పరిగణిస్తారు. ఒక మోస్తరు తీవ్రత ఉన్నప్పుడు లాపరో స్కోపీ సర్జరీ చేయడం ద్వారా మంచి ఫలితం సాధించవచ్చు. లాపరో స్కోపీ తరువాత ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ మరియు ఐయుఐ
చేయడం వలన కూడా సంతాన సాఫల్యతా ఫలితాలు వస్తాయి. ఈ ప్రక్రియవల్ల గర్భవతులు కానట్లయితే ఐవిఎఫ్, ఇక్సీ విధానాలు అత్యంత ఉత్తమమైనవి. చికిత్స విషయాలలో అశ్రద్ధ అలసత్వం వహించకుండా వైద్యుల సలహాలు పాటించడం శ్రేయస్కరం.
గమనిక : అతిముఖ్యమైన విషయం ఏమిటంటే- బహిష్టులో నెప్పి సాధారణమే అని అశ్రద్ధ చేయకుండా నెప్పి తీవ్రత
ప్రతినెలా పెరుగుతున్నట్లయితే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించి చికిత్స పొందడం మంచిది…!
– డా. కొల్లి రమాదేవి
MD, DNB,DGO (MRCOG), స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు, ఫోన్ : 92464 – 17882
Follow us in Socail Media Platforms: Facebook | Instagram | YouTube