Egg Donation (ఎగ్ డొనేషన్) : దాతఅండాలతో గర్భధారణ

Egg Donation (ఎగ్ డొనేషన్) : దాతఅండాలతో గర్భధారణ

ట్రాన్సన్ బృందం 1983లో మొట్టమొదటి సారిగా దాత అండాలతో గర్భధారణను సఫలీకృతం చేశారు. 1985 నుండి ఇంగ్లాండ్లోని బోర్నోహాల్ క్లినిక్లో దాత అండాలతో గర్భధారణ ప్రక్రియను అమలు చేయడం ప్రారంభమయ్యింది. Egg Donation (ఎగ్ డొనేషన్) : దాతఅండాలతో గర్భధారణ

దాత అండాలతో గర్భధారణ అంటే ఏమిటి? :

స్త్రీ అండాశయంలో ప్రతినెలా ఒక అండం విడుదల అవుతుంది. కొంతమందిలో అండోత్పత్తి సరిగ్గా జరగకపోయినప్పుడు అండాలు ఉత్పత్తి జరగడానికి మందులు వాడాల్సి వస్తుంది. దాంతో అండాలు ప్రేరేపింపబడి ఉత్పత్తి అవుతాయి.

ఈ విధంగా మందులు వాడినప్పటికీ అండాలు విడుదల కాకపోయినట్లయితే భార్య అండాలకు బదులు దాత అండాలను సేకరించి, భర్త వీర్యకణాలతో ఫలదీకరణ చెందించి, తద్వారా ఉద్భవించిన ఎంబ్రియోలను భార్యగర్భ కోశంలో ప్రవేశపెడతారు.

ఈప్రక్రియ ఎవరికి అవసరమౌతుంది?

అండాల ఉత్పత్తి అసలు జరగనివారికి, ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అయిన వారికి, 40 సంవత్సరాలకన్నా ముందుగానే అండోత్పత్తి తగ్గిపోవడం లేదా ఆగిపోవడం జరిగేవారికి, 25 నుంచి 40 సంవత్సరాల మధ్యవయసులోనే నెలసరులు ఆగిపోయిన వారికి, అండాలు విడుదల కానివారికి దాత అండాలతో గర్భధారణ (ఎగ్జానేషన్) ప్రక్రియను అమలు చేయవలసివస్తుంది. 

అలాగే- చాలామందిలో ఏకారణం లేకుండానే అండాలు విడుదల కాకపోవచ్చు. నెలసరులు సక్రమంగా రాకపోవడం లేదా ఆగిపోవడం జరగవచ్చు. ఇందుకు జన్యుపరమైన కారణాలు (టర్నర్ మొజాయిక్ సిండ్రోమ్, గొనెడల్ డినిసస్, ఇమ్యూనాజికల్ ప్రోబ్లమ్స్, ఆటో ఇమ్యూన్ ప్రోబ్లమ్స్) వంటివి ఉండవచ్చు.

అలాగే అండాలు విడుదల జరగపోవడానికి ఇతరత్రా కారణాలు కూడా ఉండవచ్చు. అవేమిటంటే- ఒవేరియన్ ట్యూమర్స్ రావడం వల్ల ఓవరీస్ తీసివేయవలసివచ్చినప్పుడు, రేడియోథెరపీ, కీమోథెరపీ ఇవ్వవలసి వచ్చినప్పుడు కూడా అండోత్పత్తి జరగడం ఆగిపోవచ్చు. ఇటువంటి వారికి దాత అండాలతో గర్భధారణ ప్రక్రియను అమలు చేయవలసి ఉంటుంది.

అదే విధంగా- గర్భసంచి నిర్మాణం సక్రమంగానే ఉన్నప్పటికీ అసలు మెచ్యూర్ కానివారికి, రెసిస్టెంట్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న సందర్భాలలో … అంటే – రుతుక్రమం రాకపోవడం, FSH, CH హార్మోన్ హైలెవెల్స్లో ఉన్నప్పటికీ అండోత్పత్తి జరగడానికి ఇచ్చే మందులు, హార్మోన్ ఇంజక్షన్స్కు రెస్పాండ్ కానప్పుడు, అండాశయాల పనితీరు సక్రమంగా ఉండి అండాలు ఉత్పత్తి అవుతున్నా గర్భధారణకు సమస్యలు ఎదురవుతున్న మరికొన్ని సందర్భాలలో కూడా దాత అండాలతో గర్భధారణ ప్రక్రియను అమలు చేయవలసి వస్తుంది.

స్త్రీలలో క్రోమోజోమ్స్ తేడాలు ఉన్నవారికి, కొన్ని జెనెటిక్ వ్యాధులు బిడ్డకు సంక్రమించే అవకాశం ఉన్న సందర్భాలలో కూడా ఎగ్ డొనేషన్ ప్రక్రియను అమలు చేయవలసి ఉంటుంది. అయితే ఇటువంటి వారికి ప్రీ ఇంప్లాంటేషన్ డయాగ్నోసిస్ (PGD) చేసి ఇబ్బంది లేదని నిర్ధారించుకున్న మీదటే ఎంబ్రియోలు ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది.

ఇది చాలా ఖర్చుతోనూ, రిస్క్ తోనూ కూడుకున్నది కాబట్టి అందరికీ చేయించుకోవటం సాధ్యపడకపోవచ్చు. IVF, ICSI ప్రక్రియలు పలుసార్లు చేసినప్పటికీ ఫలితం లేనప్పుడు దాత అండాలతో గర్భధారణ (ఎగ్జానేషన్) ప్రక్రియను ప్రయత్నించినట్లయితే ప్రయోజనం ఉండవచ్చు.

IVF ICSI ప్రక్రియలు ఎందు ఫెయిల్యూర్ అవుతాయి?:

సూపర్ ఓవ్యూలేషన్ డ్రగ్స్కి పూర్ రెస్పాన్స్ ఉన్నప్పుడు, చాలా సార్లు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫాలికల్లో అండాలు ఉత్పత్తి  కాకపోయినప్పుడు, IVF, ICSI. ప్రక్రియల వల్ల తయారైన పిండాలు చాలా బాగున్నప్పటికీ అవి గర్భసంచిలో సరిగా ఇంప్లాంట్ కాలేకపోయినప్పుడు IVF ICSI విధానాలు ఫెయిల్యూర్ అయినట్లుగా భావించవలసివస్తుంది.

ఈ ఆధునిక విధానాలు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాని సందర్భాలలో దాత అండాలతో భర్త వీర్యకణాలను ఫలదీకరణ చెందించి, భార్య గర్భకోశంలోకి ప్రవేశపెట్టడం ఓ మంచి ప్రత్యామ్నాయం. 45 సంవత్సరాలు దాటిన స్త్రీలకు వారి అండాలను ఉపయోగించడం కంటే దాత అండాలతో గర్భధారణ ప్రక్రియ అమలు చేయడం మెరుగైన ఫలితాలను అందించే మంచి పద్ధతిగా సూచించడం జరుగుతుంది.

అండాలను ఎలా సేకరిస్తారు? :

ఆరోగ్యవంతమైన స్త్రీలనుంచి అండాలను సేకరించడం జరుగుతుంది. చాలాదేశాలలో స్త్రీలు వాలంటరీగా తమ అండాలను ఇవ్వడానికి ముందుకొస్తారు. ఇన్ఫెర్టిలిటీ ప్రోబ్లమ్స్ గురించి మనదేశంలో ప్రజలకు ఇంకా సరైన అవగాహన లేకపోవడంతో ఇక్కడ డోనార్స్ సంఖ్య తక్కువ.

ఇటువంటి సమయంలో పేషంటుకు అంగీకారమైతే వారి బంధువులు లేదా స్నేహితులు కూడా అండాలు డొనేట్ చెయ్యవచ్చు. కానీ- ఇందువల్ల అనానిమిటీ వంటి సమస్యలు మరియు ఇతరత్రా సమస్యలు ఏర్పడవచ్చు.

IVE ప్రక్రియను పొందుతున్న కొంతమంది స్త్రీలు తమకు అండాలు ఎక్కువగా వచ్చినట్లయితే – ఆ ఎక్కువగా వచ్చిన అండాలను డొనేట్ చెయ్యడానికి ఇష్టపడుతుంటారు. లేదంటే- ఎగ్ షేరింగ్ విధానాన్ని కూడా అమలు చెయ్యవచ్చు.

దీనివల్ల దాతకూ, లబ్ధిదారులకూ కొంత మేరకు ఖర్చు కలసివస్తుంది. ప్రొఫెషనల్ డోనర్స్ నుంచి కూడా అండాలను సేకరించవచ్చు. అయితే – కొన్ని కొన్ని దేశాలలో ప్రొఫెషనల్ డోనర్స్ను ప్రోత్సహించరు. HEFA కోడ్ ప్రకారం 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయసుండే స్త్రీలను మాత్రమే డోనర్స్తో అంగీకరించడం జరుగుతుంది.

గ్రహీతలకు వయసుతో సంబంధం లేనప్పటికీ 50సంవతసరాల వయస్సు వరకూ ఎగ్జా డొనేషన్ ప్రక్రియను అమలు పరచడం ఉ త్తమంగా ఉంటుంది. సంతానవతులైన స్త్రీల నుంచి అండాలను సేకరించినట్లయితే వీరి అండాలద్వారా మంచి సక్సెస్ సాధించవచ్చు.

డోనార్స్కు పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. డీటైల్డ్ ఫ్యామిలీ హిస్టరీ, వార ఎదుర్కొంటున్న ఆరోగ్యసమస్యల (వ్యాధుల) వివరాలు, హైపటైటిస్, B, C, HIV-I, &II, VDRL, Cryotyping, జనరల్ ఎగ్జామినేషన్, పెల్విక్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మాత్రమే దాతలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

అంటే- పూర్తి ఆరోగ్యవంతులైన వారిని మాత్రమే డోనార్స్ అనుమతిస్తారు. ఫెర్టిలిటీ సెంటర్స్లో-డోనార్స్కు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ- వాళ్ళకు నిర్వహించబోయే విధానాలను గురించి పూర్తిగా వివరించి, అవగాహన కల్పిస్తారు. వీరికి నిర్వహించబోయే విధానాలు ఎలా ఉంటాయంటే- హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చి, పాలికిల్స్ పరిపక్వత చెందిన తరువాత మత్తుమందు ఇచ్చి, ఆల్ట్రా సౌండ్ సహాయంతో సన్నటి సూదిద్వారా అండాలను సేకరించడం జరుగుతుంది.

ఈ విధివిధానాలను పూర్తిగా వివరించి, అవగాహన కల్పించిన అనంతరం వారి వద్ద నుంచి రాతపూర్వక అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఎగ్జా డొనేషన్ ప్రక్రియను అమలు పరుస్తారు.

విధానం :

ఈ విధానం ప్రారంభించడానికి కొద్ది నెలల ముందునుంచీ డోనార్స్ మరియు గ్రహీతల మెన్సెస్ట్రువల్ సైకిల్ను క్రమబద్దీకరించి, ఇద్దరికీ ఒకేసారి రుతుక్రమం వచ్చేటట్లుగా చేస్తారు.

 

గ్రహీతలకు కూడా పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి గ్రహీతల గర్భసంచిపొరను ప్రిపేర్ చేస్తారు. గ్రహీతల గర్భసంచి ఎంబ్రియోను ఇముడ్చుకోవడానికి అవసరమయ్యే మందులు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ ఒక క్రమపద్ధతిలో ఇవ్వడం వల్ల ఎండోమెట్రియం పొర మందం పెరుగుతుంది.

ఇది 8.మి.మీ. కన్నా ఎక్కువగా పెరిగిన తరువాత ఈ ప్రక్రియ అమలు చేయడం జరుగుతుంది. ఇదిలా ఉంటే- దాత నుంచి అండాలను సేకరించే ముందు నుంచీ గ్రహీతకు ప్రొజెస్టిరోన్ అనే టాబ్లెట్స్ మరియు ఇంజక్షన్స్ ఇవ్వడం వల్ల ఎండోమెట్రియం ఎంబ్రియోను ఇముడ్చుకోవడానికి సిద్ధంగా తయారవుతుంది.

ఇందుకు సుమారుగా 12 నుంచి 20 రోజుల వరకూ సమయం పడుతుంది. దాత అండాలను ఉత్తేజపరచడం : డోనారికి రుతుక్రమం అయిన రెండవ రోజునుంచీ హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడం వలన అండాలు ప్రేరేపింపబడి ఒకటికన్నా ఎక్కువ అండాలు (5-6 అండాలు) ఉత్పత్తి జరుగుతాయి

ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మానిటర్ చెయ్యడం ద్వారా ప్రతిరోజు ఎన్ని హార్మోన్ ఇంజక్షన్స్ ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. ప్రతిరోజూ స్కానింగ్ చెయ్యడం ద్వారా అండాలు మరీ ఎక్కువగా ఉత్తేజితం కాకుండా తగిన మోతాదులో ఉత్తేజితం అయ్యేలా మాత్రమే ఇంజక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.

అండాలు వెలికి తీయడం :

ఫాలికిల్స్ 18 నుంచి 20 మి.మీ. వచ్చిన తరువాత పరిపక్వత కోసం HCG అనే ఇంజక్షన్ ఇస్తారు. ఈ ఇంజక్షన్ ఇచ్చిన 34 నుంచి 36 గంటలలోపుగా అండాలను సేకరిస్తారు. అండాలను వెలికితీసేటప్పుడు డోనార్కి మత్తుమందు ఇచ్చి ఆల్ట్రాసాండ్ సహాయంతో సన్నటి సూది ద్వారా అండాలను సేకరించడం జరుగుతుంది.

ఈ విధంగా అండాలను వెలికి తీసిన 6 నుంచి 8 గంటల తర్వాత డోనార్ హాస్పటల్నుంచి డిశ్చార్జె తన దైనందనిక కార్యక్రమాలను యధాతథంగా చేసుకోవచ్చు. అదే విధంగా – డోనార్ హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకునే సమయంలో కూడా తన నిత్యజీవన కార్యక్రమాలను యధాతథంగా నిర్వహించుకోవచ్చు. 

గ్రహీతకు ఎంబ్రియో ట్రార్స్ఫర్ :

డోనార్ నుంచి సేకరించిన అండాలను గ్రహీత భర్త వీర్య కణాలతో ఫలదీకరణం చెందించిన తరువాత ఏర్పడిన ఎంబ్రియోలను 48 గంటల నుంచి 120 గంటల మధ్య సన్నటి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కేథడర్ ద్వారా గ్రహీత గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. అనంతరం- ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యేందుకు వీలుగా ఈస్ట్రోజెన్, మరియు ప్రొజెస్టిరోన్ మాత్రలు, లేదా ఇంజక్షన్స్ రూపంలో ఇస్తారు.

ఎంబ్రియోలు ట్రాన్స్ఫర్ జరిగిన 14 రోజుల తరువాత ప్రెగ్నెన్సీ తొలిదశలో నిర్ధారణ కోసం B-HCG అనే టెస్ట్ నిర్వహిస్తారు. 10 రోజుల తరువాత ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈపరీక్ష ద్వారా తొలిదశలో జస్టేషనల్ శాక్ను గుర్తించిన అనంతరం గర్భిణీని నిర్ధారిస్తారు.

జస్ట్రేషనల్ శాక్ గర్భిణీ ఏర్పడిన ప్రదేశం వద్ద ఒక సన్నని రింగ్ కనిపిస్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే హార్మోన్ టాబ్లెట్స్ కంటిన్యూ చెయ్యవచ్చు. మళ్ళీ 15 రోజుల తర్వాత గర్భస్థపిండ గుండెస్పందనలు (ఫీటల్ హార్ట్) తెలుసుకునేందుకు మరోసారి స్కానింగ్ నిర్వహిస్తారు.

గర్భిణీ 10-12 వారాలు వచ్చేంతవరకూ హార్మోన్ల సపోర్ట్ కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత సాధారణ గర్భిణీలోలాగే అవసరమైన పోషక పదార్థాలు (ఐరన్, కాల్షియం వంటివి) మాత్రమే ఇస్తారు. అసలు గర్భిణీ వచ్చే అవకాశమేలేని మహిళలు కూడా ఈ అత్యాధునిక విధానం వలన గర్భిణీ దాల్చి, పండంటి బిడ్డలను వారసులుగా పొందుతున్నారు.

– డా. కొల్లి రమాదేవి

MD, DNB,DGO (MRCOG), స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు, ఫోన్ : 92464 – 17882

Follow us in Socail Media Platforms: Facebook | Instagram | YouTube