అబార్షన్స్ |Abortions

Abortions

అబార్షన్స్| Abortions

గర్భిణీ నిర్ధారణ జరిగిన తరువాత తొమ్మిదినెలలపాటు అమ్మకడుపులో ఒక రూపాన్ని సంతరించుకుని ఒక అందమైన శిశువుగా ఈ భూమి మీదకి వచ్చే బిడ్డకోసం ఎదురుచూస్తుంది తల్లి. అటువంటి బిడ్డ పిండదశలోనే నీరుకారిపోవడం ఆ తల్లికి నిజంగా గుండెకోతే! గర్భిణీ ధరించిన తొలిదినాల్లో జరిగే గర్భవిచ్ఛిత్తి స్పష్టత లేకుండానే జరిగిపోతే నాలుగు నుండి అయిదునెలల మధ్యలో జరిగే గర్భవిచ్ఛిత్తి పుట్టబోయే బిడ్డపై ఆ తల్లి పెంచుకున్న ఆశల్నీ ఆకాంక్షల్నీ మమతానురాగాలను హరించివేస్తుంది.

మరో బిడ్డకు జన్మనిచ్చే బృహత్తర బాధ్యతలో నిమగ్నమైన ఆ తల్లి ఆశల్ని అడియాసల్ని చేసే ‘గర్భస్రావం’ రకరకాల కారణాలతో వస్తుందని వైద్యశాస్త్రం వెల్లడిస్తోంది. గర్భవతి అని నిర్ధారణ జరిగిన తరువాత ఆమె సరైన జాగ్రత్తలు తీసుకోకున్నా, పిండం ఎదిగేందుకు అవసరమైన హార్మోన్లు, (ప్రొజెస్ట్రోన్) తక్కువగా ఉన్నా, గర్భసంచి చిన్నదిగా ఉన్నా, గర్భసంచి నిర్మాణంలో తేడాలు ఉన్నా,

గర్భసంచిలో కణితులు ఉన్నా (ఫైబ్రాయిడ్స్), గర్భంలో ఎదుగుతున్న శిశువుకు క్రోమోజోములలో తేడాలు ఏర్పడినా, శారీరకంగా అధిక శ్రమకు గురైనా, తొలిదినాలలో దూరప్రయాణాలు చేసినా,_గర్భిణీ సమయంలో తల్లి మానసిక ఒత్తిడికీ, శ్రమకూ, అలజడికి గురైనా, గర్భిణీ సమయంలో ఇతరత్రా కారణాలతో ఆపరేషన్లు చేయించుకోవలసివచ్చినా, మత్తుపదార్థాలు వినియోగించినా, వాడకూడని మందులు వాడినా, భార్యాభర్తల బ్లడ్ గ్రూప్ లు (ఎబిఒ ఇన్కంపాటిబులిటి కలవకపోయినా, (ఉదా: భర్త గ్రూపు ‘ఎ’ కాగా భార్యది ‘ఓ’ గ్రూప్ అయినప్పుడు తొలిదశలోనే అబార్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ),

పోషకాహారలోపాలు ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, విటమిన్-ఇ లోపించినా, గర్బిణీ ధరించిన మొదటిదినాలలో వైరల్ ఇన్ఫెక్షన్లు (రుబెల్లా, సైటో మెగల్లో వైరస్, హెపటైటిస్, ఇన్ఫ్లుయింజా వైరస్) సోకినా, తీవ్రమైన జ్వరాలు వచ్చినా, ఆకస్మిక ప్రయాణాల కారణంగా కడుపుపై ఒత్తిడి తగిలినా గర్భిణీ తొలిదశలో అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గర్భిణీ మూడోనెల తర్వాత అబార్షన్లకు కారణమయ్యే ఆరోగ్య సమస్యలు

గర్భిణీ మూడోనెల దాటిన తరువాత జీన్స్లో తేడాలున్నా, గర్భసంచి ముఖద్వారం సక్రమంగా లేకపోయినా, జంటా (మాయ) గర్భసంచి కిందభాగంలో అతుక్కోవడంవల్ల, దీర్ఘకాలిక వ్యాధులు (బిపి, కిడ్నీ సంబంధిత వ్యాధులు, గుండెజబ్బులు) ఉంటే శిశువుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో అబార్షన్లు జరుగుతుంటాయి. హైపో, హైపర్ థైరాయిడ్ లోపాలు, షుగర్ లెవెల్స్ (డయాబెటిస్) కంట్రోల్లో లేకపోయినా గర్భవిచ్ఛిత్తి జరుగుతుంది. గర్భిణీ ధరించిన ఇరవై వారాలలోపులో గర్భస్రావం జరిగినట్లయితే దానినే అబార్షన్లుగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్ట చేసింది.

లేటు వయసులో గర్భిణీ అయినప్పుడు అబార్షన్ల రకాలు మరియు కారణాలు

ఇదిలా ఉంటే – లేటు వయసులో (34 సం॥ దాటిన తరువాత) గర్భిణీ ధరించినప్పుడు కూడా అబార్షను అయ్యే అవకాశాలు ఎక్కువ. ఉదా: ఇలాంటి వారిలో ప్రతిసంవత్సరానికి 2.4 శాతం చొప్పున అబార్షన్స్ అధికమౌతున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. ఎక్కువశాతం అబార్షన్లు గర్భిణీ ధరించిన మొదటి మూడు నెలల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. మూడు నెలలలోపు జరిగే ఈ అబార్షన్లను ప్రీ క్లినికల్ అబార్షన్, క్లినికల్ అబార్షన్, వేనిషింగ్ ఫిట్నెస్, బ్రైటెడ్ ఓవమ్ అని చెప్పవచ్చు.

ప్రీ క్లినికల్ అబార్షన్ యూరిన్లో గానీ, రక్తంలో బిటా హెచ్సిలోగానీ గర్భిణీ ధరించినట్లుగా నిర్ధారణ జరిగినప్పటికీ నెలసరి తేదీ దాటిన నాటినుండి 14 రోజుల లోపల రుతుక్రమ తరహాలో బ్లీడింగ్ జరగడాన్ని అబార్షన్ అయినట్లుగా భావించవలసి వస్తుంది. దీనికి అండాలలో ఏర్పడిన లోపాలు లేదా గర్భసంచికి ఎంబ్రియోలు సరిగ్గా అతుక్కోకపోవడం ప్రధాన కారణమౌతాయి. క్లినికల్ అబార్షన్ నెలసరి తేదీ దాటిన 14 రోజుల తరువాత బ్లీడింగ్ అయినట్లయితే దానికి క్లినికల్ అబార్షన్గా చెప్పవచ్చు. చాలామందిలో సాధారణంగా వచ్చిన గర్భిణీలో తాము గర్భిణీ అని తెలుసుకోకుండానే ఇటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు.

వేనిషింగ్ ఫీటసెస్ :

గర్భిణీ ధరించిన మొదటి మూడు నెలలలోపు ఎటువంటి బ్లీడింగ్ లేదా ఇతర లక్షణాలు కనిపించకుండానే గర్భం మాయం అయ్యిందన్న మాట అప్పుడప్పుడూ వింటుంటాం. ఇది గర్భం ధరించిన 18 శాతం మందిలో మనం చూడవచ్చు. గర్భిణీ నిర్ధారణ కోసం జరిపిన మొదటి స్కానింగ్ పరీక్షలో గర్భిణీ ఏర్పడిన ప్రదేశాన్ని జస్ట్రేషనల్ శాక్ గా గుర్తిస్తారు. జస్టేషనల్ శాక్ క్రమక్రమంగా ప్రతిరోజూ పెరిగి, అందులో పిండం రూపుదిద్దుకుంటుంది.

 అయితే కొద్దిమందిలో పిండం రూపుదిద్దుకోకపోగా జస్టేషనల్ శాక కూడా కుంచించుకుపోయి అసలు గర్భం ధరించిన ప్రదేశమే కనిపించకపోవచ్చు. దీనినే వేనిషింగ్ ఫీటసెస్ అంటారు. అలాగే తొలి స్కానింగ్ పరీక్షలో 2 లేదా 3 జెస్టేషనల్ శాక్స్ని గుర్తించగా ఆ తదుపరి స్కాన్లో 1 లేదా 2 మాత్రమే ఉంటాయి. అంటే ఒకటి లేదా 2 ఎంబ్రియోలు మాయమవుతాయి.

రకరకాల అబార్షన్స్ :

అబార్షన్లు రకరకాలుగా ఉంటాయి. వీటిలో థ్రెటెండ్ అబార్షన్స్ బ్రైటెడ్ ఓవమ్, ఇన్వెటబుల్ అబార్షన్, ఇన్కంప్లీట్ అబార్షన్, కంప్లీట్ అబార్షన్, సెప్టిక్ అబార్షన్, మిస్డ్ అబార్షన్స్ వగైరాలు.

థ్రెటెండ్ అబార్షన్స్ :

ఈ రకమైన అబార్షన్స్ లో ఎరుపురంగులో బ్లీడింగ్ కొద్దిగా కనిపిస్తుంది. పిండము బయటకు రాదు. పొత్తి కడుపులో నొప్పి కూడా ఉండకపోవచ్చు. ఈ దశలో కనుక సరైన ట్రీట్మెంట్ పొందినట్లయితే 50శాతం మందిలో గర్భిణీ కొనసాగే అవకాశాలు ఉంటాయి. స్కానింగ్ పరీక్ష ద్వారా పిండముయొక్క పరిస్థితిని తెలుసుకోవచ్చు.

ప్రెగ్నెన్సీ డేట్స్తో సమానంగా ఉండి, ఫీటస్కు గుండె స్పందన ఉన్నట్లయితే గర్భిణీ కొనసాగడానికి తగిన వైద్య సహాయం పొందవలసి వుంటుంది. సాధారణంగా గర్భసంచికి పిండము అతుక్కున్నచోట రక్తస్రావం (Chorio Decidual Haemarrage) జరగటం వలన బ్లీడింగ్ కనిపిస్తుంది. డేట్తో సమానంగా లేకపోయినా, లేదా గుండె స్పందన స్కానింగ్లో కనిపించకపోయినా ప్రెగ్నెన్సీ కొనసాగే అవకాశాలు తక్కువ.

ఒక వారం తరువాత మళ్ళీ స్కానింగ్ పరీక్ష చేసి పెరుగుదల లేనట్లయితే డిఎన్సి చేయవలసి వస్తుంది. బైటెడ్ ఓవమ్ కొద్దిమందిలో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలో పదివారాలు ఉండవలసిన గర్భిణీ ఏడు వారాల సైజుకే పరిమితం కావడం, ఒక్క జస్టేషన్ శాక్ మాత్రమే ఉండి లోపల పిండం లేకపోవడాన్ని బ్లైటెడ్ ఓవమ్ అంటారు. ఇటువంటివారిలో బ్లాక్ కలర్ లేదా మట్టిరంగులో కొద్దిమాత్రపు బ్లీడింగ్ కనిపిస్తుంది. అనంతరం వారంరోజులలోపునే నెలసరి రూపంలో దానంతట అదే బయటికి వచ్చేస్తుంది.

ఇవన్నీ కూడా జన్యుపరమైన తేడాలు (క్రోమోజోమల్ డిఫెక్ట్స్) ఉన్న పిండాల్లో జరుగుతుంటాయి. ఇన్వెటబుల్ అబార్షన్ అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, పెల్విక్ ఎగ్జామినేషన్లో గర్భసంచి ముఖద్వారం తెరచుకుని ఉన్నట్లయితే ఇన్వెటబుల్ అబార్షన్ అంటారు.

అధిక రక్తస్రావం జరగటం వలన బిపి బాగా తగ్గిపోతుంది. ఇటువంటివారు తక్షణమే వైద్యసహాయం పొందవలసి ఉంటుంది. దశలోఉన్న గర్భిణీ కొనసాగే అవకాశం లేదు. డిఎస్సి చేసి అధిక రక్తస్రావాన్ని అదుపు చేయవలసి వస్తుంది.

ఇన్కంప్లీట్ అబార్షన్స్ :

వరుసగా గానీ, మధ్యమధ్యలోగానీ బ్లీడింగ్ అవ్వటం, గర్భిణీకి సంబంధించిన కణజాలం పడిపోవడం, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షచేస్తే గర్భసంచిలో ఇంకా కొంత కణజాలం ఉండటం గమనిస్తాం. డిఎస్సి చేసి మిగిలిన కణజాలాన్ని తీసివేయవలసి వస్తుంది.

లేనట్లయితే బ్లీడింగ్ మధ్యమధ్యలో అవ్వటం, ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోయి సాధారణ స్థితిలో పిల్లలు పుట్టే అవకాశం పోతుంది.

కంప్లీట్ అబార్షన్స్ :

గర్భిణీకి సంబంధించిన కణజాలం మొత్తం పడిపోయి బ్లీడింగ్ అవ్వటం ఆగిపోతుంది. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్లో గర్భిణీకి సంబంధించిన దాఖలాలు ఏమీ ఉండవు. 48గంటలలోపు ప్రెగ్నెన్సీ టెస్టు కూడా నెగిటివ్ వస్తుంది.

కొద్దిమందిలో రెండో నెలలోనే అబార్షన్ జరిగినట్లయితే 24గంటలలోపే నెగెటివ్ వస్తుంది. మిస్డ్ అబార్షన్ ఫీటస్ గానీ, ఎంబ్రియోగానీ నాలుగు వారాలవరకూ గర్భసంచి లోపలే ఉండిపోతుంది. బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించవు.

గర్భసంచిలోపల ఉన్న పిండం క్రమేపీ కుచించుకుపోయి ఒక చిన్న గడ్డలాగా మారిపోతుంది. దీనినే బ్లడ్మెల్ అంటారు. నాలుగు నెలల లోపల పిండం మృతిచెందినట్లయితే ఒకటిరెండుసార్లు మట్టిరంగులో బ్లీడింగ్ అవ్వటం తప్ప మరే ఇతర లక్షణాలు ఉండవు. గర్భిణీకి సంబంధించి ఇంతవరకు ఉన్న లక్షణాలన్నీ క్రమేపీ తగ్గిపోతుంటాయి.

అప్పటికీ వైద్యసహాయం తీసుకోనట్లయితే కొంతకాలానికి గడ్డరూపంలో ప్రెగ్నెన్సీ దానంతట అదే బయటకి వచ్చేస్తుంది. కొంతమందిలో నాలుగోనెలలో అబార్షన్ జరిగిన తరువాత వక్షోజాలలో పాలుకూడా పడతాయి. అయితే ప్రెగ్నెన్సీ టెస్టు మాత్రం నెగెటివ్ వస్తుంది.

సెప్టిక్ అబార్షన్స్ :

ఇన్కంప్లీట్ అబార్షన్ జరిగినప్పుడు వైద్యసహాయం పొందనట్లయితే ఇన్ఫెక్షన్ రావడం వలన పొత్తికడుపులో నొప్పి, జ్వరం రావడం, దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్ రావడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు దానిని సెప్టిక్ అబార్షన్ గా గుర్తించవచ్చు.

తక్షణ వైద్యసహాయం పొందడం చాలా అవసరం ! ఇన్నిరకాల అబార్షన్లు ఉంటాయి కాబట్టి గర్భిణీ అని నిర్ధారణ జరిగిన తరువాత క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటూ, ఎప్పటికప్పుడు పిండం ఎదుగుదలను గమనించుకుంటూ డాక్టరు సలహాలు పాటించడం చాలా సమయాల్లో మేలు చేస్తుంది.

– డా॥కొల్లి రమాదేవి,

MD, DNB, DGO (MRCOG)

స్త్రీ సంబంధిత వైద్యనిపుణులు, ఫోన్ :  +91 92464 17882

Follow us in Social Media Platforms: Facebook | Instagram | YouTube |