సంతానోత్పత్తికి సహాయతే IUI Part-2
IUI విధంగా చేస్తారు ? :
ఈ విధానంలో ముందుగా అండాలను ఉత్తేజపరచడం జరుగుతుంది. సాధారణంగా ఐయుఐ (IUI) విధానాన్ని నేచురల్ అండం విడుదల అయినప్పుడు చెయ్యవలసి ఉంటుంది. అలా కాని పక్షంలో కంట్రోల్డ్ ఒవేరియన్ స్టిమ్యులేషన్ ద్వారా అండాలు ఎక్కువగా అంటే రెండు లేదా మూడు వచ్చేటట్లు చేసి ఈ విధానం నిర్వహించడం జరుగుతుంది.
ఈ విధంగా అండాలను ఎక్కువగా ఉత్తేజపరచి ఐయుఐ (IUI) చేసినట్లయితే ఎక్కువ శాతం మందిలో సత్ఫలితం సిద్ధిస్తుందని గణాంకాల వల్ల తెలుస్తోంది. నెలసరి అయిన రెండవ రోజు నుంచి ఆరవ రోజు వరకూ క్లోమిన్ సిట్రేట్ లేదా లెట్రోజాల్ అనే టాబ్లెట్ అవసరాన్ని బట్టి ఇవ్వవలసి ఉంటుంది.
HMG అనే ఇంజక్షన్ను ఫాలికిల్ 18 నుంచి 20 మిల్లీమీటర్ల సైజు వచ్చే వరకూ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్లో మానిటర్ చేస్తూ ప్రతిరోజూ ఇస్తారు. అలాగే హార్మోన్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఫాలికిల్పె రుగుదలనూ, ఎండోమెట్రియం పెరుగుదలనూ తరచుగా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా నిర్ధారించుకోవడం జరుగుతుంది.
అదే విధంగా పాలికిల్స్ 18 నుంచి 20 మిల్లీమీటర్ల సైజు వచ్చిన తరువాత పరిపక్వత కోసం HCG అనే ఇంజక్షన్ ఇస్తారు.
ఇన్సెమినేషన్ ఎప్పుడు చేస్తారు? :
కొన్ని సందర్భాలలో రెండుసార్లు సెమెన్ ఇన్సెమినేషన్ చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు HCG ఇంజక్షన్ ఇచ్చిన తరువాత 24 గం||లకు ఒకసారి, 48 గంటలకు మరోసారి IUI చెయ్యవలసివస్తుంది. అండం విడుదల అయిన సమయంలోనే ఐయుఐ చేసినట్లయితే HCG ఇచ్చిన 34-36 గంటల తరువాత సెమెన్ ఇన్సెమినేషన్ చేస్తారు.
సెమెన్ ప్రిపరేషన్ మరియు ఇన్సెమినేషన్ :
సెమెన్ ను పరిశుభ్రమైన (స్టెరిలైజ్డ్) వాతావరణంలో జార్లో సేకరించిన తరువాత కల్చర్ మీడియాలో ఉంచుతారు. డెన్సిటీ గ్రేడియంట్ టెక్నిక్ సహాయంతో వీర్యకణాలను శుద్ధిపరచి, కదలికలు ఎక్కువగా ఉన్న వీర్యకణాలను వేరు పరచి కల్చర్ మీడియాలో ఇన్సెమినేషన్ చేసేందుకు సిద్ధంగా ఉంచుతారు. అనంతరం పరిశుభ్రమైన వాతావరణంలో ఎండోమెట్రియం పొర దెబ్బతినకుండా జాగ్రత్తగా కాథెటర్ సహాయంతో గర్భసంచి ముఖద్వారం ద్వారా, సేకరించి ఉంచిన వీర్యకణాలను ప్రవేశపెడతారు.
ఈ సమయంలో ఎటువంటి మత్తుమందు ఇవ్వనవసరం ఉండదు. ఇన్సెమినేషన్ తరువాత అరగంట నుంచి ఒక గంటసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అటుపిమ్మట ఇంటి దగ్గర ఎక్కువ శ్రమ అలసటకు గురికాని సాధారణ పనులు చేసుకోవచ్చు.
సక్సెస్ రేటు ఎలా ఉంటుంది ? :
ఇన్ఫెర్టిలిటీ కారణాన్ని బట్టి, భార్యాభర్తల వయసును బట్టీ, ఎంతకాలం నుంచి ఇన్ఫెర్టిలిటీ ప్రోబ్లమ్ ఉందనే దాన్ని బట్టీ, వీర్యకణాలు ఎంతమేరకు ఫలదీకరణ శక్తి కలిగి ఉన్నాయనే దాన్ని బట్టీ సక్సెస్ రేటు ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన అంశాలు ఏమిటంటే- స్త్రీ యొక్క వయసు పెరిగే కొద్దీ నేచురల్ ఫెర్టిలిటీ తగ్గుతూ ఉంటుంది. అలాగే – అండాల నాణ్యత తగ్గడం, ఎండోమెట్రియం రిసెప్టివిటీ తగ్గడం వంటి కారణాల వల్ల కూడా ఫెర్టిలిటీ తగ్గుతుంది.
ఒకసారి సంతానవతి అయినప్పటికీ కూడా స్త్రీ వయసు పెరిగినట్లయితే ఫెర్టిలిటీ తగ్గుతుంది. అదే విధంగా పురుషులలో కూడా వయసు పెరిగిన కొద్దీ వీర్యకణాలలో (non-dysjunction, DNA Fragmentation) తేడాలు రావడం వల్ల కూడా ఫలదీకరణ శక్తి తగ్గుతుంది. ఎక్కువ శాతం మందిలో ఐయుఐ విధానం నిర్వహిస్తున్నప్పుడు మొదటి నాలుగుసార్లలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
డోనార్ ఇన్సెమినేషన్ :
భర్త వీర్యకణాలు అస్సలు లేనప్పుడు, క్రోమోజోమ్స్ తేడాలు ఉన్నప్పుడు, అనువంశీకముగా సంక్రమించే వ్యాధులు ఉన్నప్పుడు దాత వీర్యకణాలతో ఐయుఐ చేయవలసి ఉంటుంది. ఆరోగ్యవంతమైన, తెలివితేటలు బాగా కలిగిఉన్న, తక్కువ వయసు కలిగిన దాతల నుంచి వీర్యకణాలు సేకరించడం జరుగుతుంది. దాతల వీర్యకణాలతో ఐయుఐ చేయవలసి వచ్చినప్పుడు క్రయోప్రిజర్వేషన్ చేసిన వీర్యకణాలతో ఐయుఐ చేయడం ఉత్తమం మరియు సురక్షితం.
– డా. కొల్లి రమాదేవి
MD, DNB,DGO (MRCOG), స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు, ఫోన్ : 92464 – 17882
Follow us in Socail Media Platforms: Facebook | Instagram | YouTube