సంతానోత్పత్తికి సహాయతే IUI
సంతానోత్పత్తి ప్రక్రియలో అత్యద్భుత ఆవిష్కరణగా సుమారు రెండొందలేళ్ళ కిందట జాన్ంటర్ కనిపెట్టిన ఇంట్రాయుటిరైన్ ఇన్సెమినేషన్ (IUI)ని చెప్పుకోవచ్చు. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందడంతో ఈ ప్రక్రియ మరింత పరిణితి చెంది నేడు సంతానోత్పత్తి ప్రక్రియలో సర్వసాధారణమయ్యింది.
ఈ ప్రక్రియలో భర్త లేదా దాత వీర్యకణాలు శుద్ధి చేసి, అధిక సాంద్రత కలిగేటట్లుగా చేసి, అండం విడుదల అయిన
సమయంలో భార్యగర్భకోశంలోనికి ప్రవేశపెడతారు.
శీతలీకరణము చెందిన సెమెన్ ను 1953లో బెంజ్ అండ్ షెర్మన్లు ఐయుఐ (IUI) పద్ధతిలో తొలిసారిగా వినియోగించారు. అయితే- ఈ విధానం 1970 నుంచి విస్తృత వినియోగంలోకి వచ్చింది.
యోనిలో డిపాజిట్ అయిన వీర్యకణాలు గర్భసంచి ముఖద్వారం ద్వారా ప్రయాణించి గర్భసంచి కుహరాన్ని దాటి, ఫెలోపియన్ ట్యూబ్లో ఉండే మధ్య భాగమైన యాంప్యుల్లాలో ఫలదీకరణకు తయారుగా ఉన్న అండాన్ని చేరుకుని సహజంగానే సంయోగము చెందుతుంది.
అయితే – ఈ ప్రక్రియ సజావుగా జరిగే సందర్భంలో -వీర్యకణాలు ప్రయాణించే మార్గంలో అవరోధాలు ఉన్నా, లేదా ప్రతికూల పరిస్థితులు ఉన్నా, వీర్యకణాలు తగినంత సంఖ్యలో లేకున్నా, కదలికలు సరిగా లేకపోయినా అవి అండాన్ని చేరుకోలేవు.
అలాగే- యోనిలో పిహెచ్ అధికంగా ఉన్నా, సర్వైకల్ మ్యూకస్ ప్రతికూలంగా ఉన్నా వీర్యకణాలు గర్భసంచి కుహరంలోనికి ప్రవేశించలేవు
దీనిని అధిగమించడం కోసం వీర్యకణాలను శుద్ధిచేసి, సాంద్రత మరియు కదలికలు, సారూప్యత ఎక్కువగా ఉన్న వీర్యకణాలను అండం దగ్గరగా ప్రవేశపెట్టడం ద్వారా ఫలదీకరణ ప్రక్రియ జరగడానికి సహాయపడటమే ఈ విధానం ప్రత్యేకతగా చెప్పవచ్చు.
పిల్లలు లేని దంపతులకు సాధారణంగా ఉపయోగించే మొదటి సహాయతాప్రక్రియే IUI. అయితే- ఫెలోపియన్ ట్యూబులు ఆరోగ్యవంతంగా ఉంటూ తెరచుకుని ఉన్నప్పుడు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది.
IUI ఎవరికి ఉపయోగపడుతుంది?:
1. మగవారిలో ఇజాక్యులేటరీ ఫెయిల్యూర్ (ejaculatory failure) ఉన్నప్పుడు, జననేంద్రియాలు నిర్మాణంలో తేడాలు ఉ
న్నప్పుడు, Hypospadiasis, వెన్ను పాముకు దెబ్బతగిలినప్పుడు, ఇంపోటెన్స్ ఉన్నప్పుడు.
2. గర్భసంచి ముఖద్వారంలో ఉండే మ్యూకస్ వీర్యకణాలు ప్రయాణించడానికి ప్రతికూలంగా ఉన్నప్పుడు.
3. 10 నుంచి 20 మిలియన్ల కంటే తక్కువగా వీర్యకణాలు ఉన్నప్పుడు, వీర్యకణాల కదలికలు తక్కువగా ఉన్నప్పుడు,
వీర్యకణాల సారూప్యతలో తేడాలు ఉన్నప్పుడు.
4. పురుషులలో యాంటీ స్పెర్మ్, యాంటీ బాడీస్ ఉన్నప్పుడు
5. స్త్రీలలో యాంటీ స్పెర్మ్, యాంటీబాడీస్ ఉన్నప్పుడు (సర్వైకల్ సీరమ్)
6. ఏ లోపం లేకున్నా సంతానం కలగనప్పుడు- అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ (Unexplained infertility)
7. స్త్రీలలో ఎండోమెట్రియోసిస్ ప్రారంభదశలో ఉన్నప్పుడు
8. అండాల విడుదలలో లోపాలు ఉన్నప్పుడు
9. స్త్రీ పురుషులిద్దరిలో లోపాలు ఉన్నప్పుడు
IUI కి సిద్ధపరచడం :
ఐయుఐ ప్రారంభించే ముందు దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. Hbs, As, HIV, VDRC, TS, Tu, TSH, PRC, FSH, LH, HSG, కంప్లీట్ సెమెన్ ఎనాలసిస్ వంటి పరీక్షలు నిర్వహిస్తారు. లాపరోస్కోపీ పరీక్ష జరుపుతారు. IUI విధానంలో ప్రతి ఒక్కసారికి 15 నుంచి 20 శాతం మందిలో సక్సెస్ ఉంటుందని దంపతులకు అవగాహన కల్పిస్తారు.
ఈ విధానాన్ని అయిదారుసార్లు ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కానట్లయితే అటుపిమ్మట ఈ విధానం వలన ప్రయోజనం ఉండదనీ, ఆ తరువాత ప్రొసీజర్స్ అయిన IVF ICSI విధానాన్ని చేయించుకోవలసి ఉంటుందని ముందుగానే దంపతులకు చికిత్సా విధానపు తీరు తెన్నులను వివరిస్తారు.
– డా. కొల్లి రమాదేవి
MD, DNB,DGO (MRCOG), స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు, ఫోన్ : 92464 – 17882
Follow us in Socail Media Platforms: Facebook | Instagram | YouTube