సంతానలేమికి పిసిఓ ఓ కారణం || PCOD Also Reason for Infertility​

Home/సంతానలేమికి పిసిఓ ఓ కారణ

సంతానలేమికి పిసిఓ ఓ కారణం || PCOD Also Reason for Infertility

సుజాతకు పెళ్ళయి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిల్లలు కలుగలేదు. సుజాతకు కూడా పిల్లలంటే ఎంత ఇష్టమో …! అమ్మ అనిపించుకోవాలని ఆమె వెయ్యిదేవుళ్ళకు మొక్కుకునేది. కాలం గడచిపోతున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. తనకు పిల్లల్లేరన్న బాధలో ఉన్న సుజాతను ఎంతకాలానికీ పిల్లల్లేరంటూ అత్తింటి వారి సన్నాయి నొక్కులు మరింత బాధకు గురిచేసేవి. తనలో తానే కుమిలిపోయేది. డాక్టరును సంప్రదిస్తే, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని నిర్ధారించారు (Polycystic Ovarian Decease, PCOD) 

పిసిఓను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన వైద్య సహాయం పొందక అలక్ష్యం చెయ్యడం వల్లే సమస్య మరింత జటిలమయ్యిందని తెలిసి సుజాత తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఉన్న వారు ఎదుర్కొనే పలు సమస్యల్లో సంతానలేమి ఓ ముఖ్యమైన సమస్యగా చెప్పుకోవచ్చు.

సాధారణంగా ఎక్కువమందిలో ప్రతినెలా ఒక అండం విడుదల అవ్వడం వల్ల రుతుక్రమం సక్రమంగా జరుగుతుంటుంది. హార్మోన్ల సమతుల్యతాలోపం కారణంగా అండం విడుదల కాకపోవడం లేదా ఆలస్యం కావడం వల్ల రుతుక్రమం కూడా ఆలస్యంగా వస్తుంది. అండం విడుదలలో జరిగే లోపాలే పిల్లలు కలుగకపోవడం అనే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు దారితీస్తుంది.

చిన్నతనంలోనే పిసిఓ సమస్య ఉందని నిర్ధారణ జరిగిన యువతులు వివాహం అయిన తర్వాత ఎటువంటి ఆలస్యం చేయకుండా పిల్లలకోసం ప్రయత్నించడం మంచిది. పిసిఓ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కొద్దిపాటి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇటువంటి సమయంలో క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రొజాల్, ఇన్సులిన్ స్థాయిని తగ్గించే మందులు, మెట్ఫార్మన్,
ఫయాజ్ వంటి మందులు వాడటం వల్ల అండం సక్రమంగా విడుదల అవుతుంది.

ఈ పిసిఓ తీవ్రత పెరిగినకొద్దీ తేలికపాటి మందులు సరిపోవు. అండం విడుదల కోసం హార్మోన్ల ఇంజక్షన్ ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, హెచ్ఎంజివంటి హార్మోన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
కొద్దిమందిలో హార్మోన్ ఇంజక్షన్లు కూడా సరియైన ఫలితం అందించవు. అటువంటప్పుడు లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అవసరం అవుతుంది. ఈ విధానం ద్వారా ఎక్కువగా ఉన్న నీటిబుడగలను తగ్గించడంవల్ల మందులు పనిచేసి ఫలితం చేకూరుతుంది. ఈ విధానం కూడా సత్ఫలితాలివ్వని మరో 10 నుంచి 20 శాతం మందికి ఐవిఎఫ్ విధానం ద్వారా సంతానలేమి సమస్యను పరిష్కరించడం సాధ్యమౌతుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ పిసిఓ సమస్య మరిన్ని అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా 35 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్న వారిలో షుగర్వ్యాధి వచ్చే అవకాశం, రక్తపోటు కలిగే అవకాశం, కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎల్.డి.ఎల్., కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం, గుండె జబ్బులు, గర్భసంచి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. అందువల్ల పిసిఓ సమస్యలకు గురైనవారు తరచుగా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం చాలా సమయాలలో మేలు చేస్తుంది.

వివాహమై ఏడాది పాటు కలసి కాపురం చేస్తున్నా సంతానవతులు కాలేదంటే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించడం మంచి పద్దతి.

– డా. కొల్లి రమాదేవి
MD, DNB,DGO (MRCOG), స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు, ఫోన్ : 92464 – 17882

Follow us in Socail Media Platforms: Facebook | Instagram | YouTube